Sabitha Indra Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ చేప్పిన మాటలను పక్కకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్పేట్లోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్నుతో చూస్తూ చర్చ కూడా చేయడం లేదన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రజలకు ఏమీ న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
రెండు కిలోమీటర్ల కాలువ..
తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది,లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. కేసులు కొట్టివేసిన తర్వాత రూ.30 వేల కోట్లతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.రూ.27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదని సబితా అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించామాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించకపోగా, తట్టేడ్డు మట్టి కూడా తీయలేదన్నారు. 45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు వివరించాలని సబితా ప్రశ్నించారు.
నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు
గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారని తెలిపారు.కేసీఆర్‌ను విమర్శించడమే సీఎం పనిగా పెట్టుకున్నారని, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. కెసిఆర్ ఆలోచనకు అనుగుణంగా మా కార్యచరణ కొనసాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హరీశ్వర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

