Gadwal district: భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
క్షేత్రం ప్రత్యేకతలు
కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమల శ్రీనివాసుడు ఏడుకొండలపై పాదం మోపకముందే తెలంగాణలోని మల్దకల్‌లో శ్రీవారు ఆదిశిలలో ఉద్భవించారని బ్రహ్మాండ పురాణంలో ఆధారాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. ఒకే శిలలో స్వామివారు లక్ష్మీ వేంకటేశ్వర, ఆంజనేయ, వరాహ, అనంతశయన మూర్తి రూపాలలో వెలయడం ఈ క్షేత్రం యొక్క అరుదైన ప్రత్యేకత. గద్వాలకు సమీపంలో పవిత్రమైన కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య వెలసిన ఈ ప్రసిద్ధ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు కర్ణాటకతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.
Also Read: Gadwal District: ఆ జిల్లాలో ఆగని అక్రమ వ్యాపారం.. అక్రమార్కులకు వరమైన తవ్వకాలు
ముఖ్య ఉత్సవాలు
ప్రతి యేటా మార్గశిర శుద్ధ పంచమి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, మార్గశిర కృష్ణ తదియ వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 3న (మార్గశిర శుద్ధ త్రయోదశి) స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. డిసెంబర్ 4న (మార్గశిర పౌర్ణమి) రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా, భక్తుల గోవింద నామస్మరణ మధ్య శోభాయమానంగా నిర్వహించబడుతుంది. స్థానిక భక్తులు మల్దకల్ వేంకటేశ్వర స్వామిని ‘మల్దకల్ తిమ్మప్ప’గా కొలుస్తారు. తిరుమలకు వెళ్లకుండా, ఈ తిమ్మప్పను ఆయనతో సమానంగా భావించి తమ మొక్కుబడులను దేవాలయ ప్రాంగణంలోనే తీర్చుకుంటారు. అంతేకాక, దేవుని కన్నా ఎత్తు ఉండకూడదనే నమ్మకంతో మల్దకల్ మండల కేంద్రంలో ఏ ఒక్కరూ కూడా ఇంటిపైభాగంలో మొదటి అంతస్తు నిర్మించకపోవడం ఇక్కడి ప్రజల నమ్మకం.
విశిష్టమైన దాసంగం
ఈ జాతరలో ప్రత్యేక విశిష్టత కలిగిన ఆచారం ‘దాసంగం’. రైతులు తాము పండించిన పంట నుంచి వచ్చిన బియ్యంతో, కొత్త మట్టి కుండలను తెచ్చి, ముందుగా దాసంగం ద్వారా స్వామివారికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాతనే భక్తులు ఆ నైవేద్యాన్ని భుజించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో శిథిలమైన ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన నల్ల సోమ భూపాలుడు, సహాయపడిన బోయ బాలుడిని పూజారిగా నియమించిన కారణంగా, నేటికీ ఈ ఆలయంలో బోయ వంశస్థులే పూజారులుగా కొనసాగుతున్నడం చారిత్రక ఆనవాయితీగా ఉంది.

