Ramchander Rao: కొందరు ఆర్ఎస్ఎస్‌పై తప్పుగా మాట్లాడుతున్నారని, కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ భారత్ లో పుట్టిన, భారత్ కోసం పుట్టిన సంస్థ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్తాన్ ప్రయోజనాల కోసం మాట్లాడే సంస్థ ఆర్‌ఎస్ఎస్ కాదని ఆయన పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు కల్పించాలనే సంకల్పంతో వాజపేయి ‘వాంబే’ అనే పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అప్పట్లో దత్తాత్రేయ ఎంపీగా ఉండగా, ఈ పథకం కింద అనేక మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయాయని ఫైరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. రూ.22,500 కోట్లు కేటాయించి ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కడతామని హామీ ఇచ్చిందని, కానీ 19 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇండ్లు ఇచ్చిన దాఖలాల్లేవని విమర్శలు చేశారు.
నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీని వలన అర్హులైన పేదలు మోసపోతున్నారని ఫైరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ప్రకాష్ రెడ్డి, మాధవి, సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మరణం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. గణేషన్ మరణంపై రాంచందర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Also Read: Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం
