Ramachandra Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)కు ఓటు వేస్తే వేస్ట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాంచందర్ రావు అధ్యక్షతన ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్లు, దేవరకొండకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీలో మేధావులు, విద్యావంతులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఆ పార్టీ గెలిచినా వారు అందులో కొనసాగుతారో? లేదో? కూడా తెలియదన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా వారికి తెలియదని చురకలంటించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ఇవ్వాలో రేపో పార్టీ ఖరారు చేయనుందన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్(Congress) పోటీ చేస్తోందా? లేక ఎంఐఎం(MIM) పోటీ చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen yadav) గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారన్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిని ఎందుకు బరిలోకి దింపడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం గతంలో బీఆర్ఎస్(BRS)తో కాపురం చేసిందని రాంచందర్ రావు విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న ఈ పార్టీల తీరును ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని 420 పనులే చేస్తున్నదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: Bandi Sanjay Kumar: ఆర్ఎస్ఎస్ కవాతులో కేంద్ర మంత్రి బండి సంజయ్
బాధ్యతలు స్వీకరించి వంద రోజులు
స్టేట్ చీఫ్‌గా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించి సోమవారంతో వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ, తన ప్రయాణం ప్రజా సేవ కోసం, తెలంగాణ(Telangana) భవిష్యత్ కోసమని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని కొనియాడారు. భుజాలు కాయలుకాసేలా జెండాలు మోసి పార్టీని అధికార పీఠం వైపు తీసుకుపోయేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి తనకు తెలుసన్నారు. కార్యకర్తల కఠోర శ్రమలో తాను ఒక భాగమని వివరించారు. ఒక కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి, అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర అధ్యక్షుడిగా అందరి ముందు ఉన్నానని వివరించారు. పార్టీకి గుండెకాయలాంటి కార్యకర్తలను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని రాంచందర్ తెలిపారు.
Also Read: Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?
