BJP : బీజేపీ ఆవిర్భావం సందర్భంగా ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు వారం పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 6న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని పోలింగ్ బూత్ లలో బీజేపీ జెండాలు ఎగురవేస్తామన్నారు.
8, 9 తేదీల్లో క్రియాశీల కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 10, 11, 12 తేదీల్లో గావ్ చలో, బస్తీ చలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యకర్తల ఇండ్లపై బీజేపీ జెండా ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు కాసం తెలిపారు. ఇది కూడా వారం పాటు చేపట్టనున్నట్లు తెలిపారు. 15, 16 తేదీల్లో కాంగ్రెస్.. అంబేద్కర్ ను అవమానించిన విషయంపై చర్చా వేదికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: Garib Kalyan Yojana Scheme: కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. సన్నబియ్యంలో ఎవరి వాటా ఎంత?
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తెలంగాణలో 41 లక్షల సభ్యత్వాలు, 45 వేల క్రియాశీల సభ్యత్వాలు, 22 వేల బూత్ కమిటీలు పూర్తయ్యాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి, కేంద్ర పథకాలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. సన్న బియ్యానికి కేంద్రం ఇచ్చే నిధులపై ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలు ఎండిపోయిందని, రైతాంగ సమస్యలపై ప్రజా పోరాటాలు చేపడుతామన్నారు.
ఆవిర్భావ వేడుకలకు కమిటీ
ఆవిర్భావ వేడుకల నిర్వహణకు కమిటీని బీజేపీ ఏర్పాటుచేసింది. కన్వీనర్ గా కాసం వెంకటేశ్వర్లు, సభ్యులుగా కట్టా సుధాకర్ రెడ్డి, జీ కీర్తిరెడ్డి, రఘునాథ్ రావు, రవినాయక్ ను పార్టీ నియమించింది. ఇదిలాఉండగా అంబేద్కర్ జయంతి నిర్వహణకు సైతం కమిటీని నియమించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ను కమిటీ కన్వీనర్ గా నియమించింది. సభ్యులుగా చికోటి ప్రవీణ్ కుమార్, రాణిరుద్రమ, కొప్పు భాష, తాడూరి శ్రీనివాస్ ను నియమించింది.