Localbody Elections: ‘లోకల్’ సర్వే చేస్తున్న బీజేపీ!
పైరవీలకు తావు లేకుండా ఉండేందుకే..
గెలుపు గుర్రాలకే టికెట్
తక్కువ టైంలో సర్వేతో సక్సెస్ అయ్యేనా?
కొన్నిచోట్ల అభ్యర్థుల కరువు
ఇబ్బందుల నుంచి గట్టెక్కేనా?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక పోరుకు (Localbody Elections) అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. కాగా బీజేపీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక కోసం సర్వే చేపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తొలి దఫా సర్వే పూర్తయినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే తెలిపారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేందుకు త్వరలో మరిన్ని సర్వేలు చేపట్టనున్నట్లు సమాచారం. పైరవీలకు తావు లేకుండా ఉండేందుకే ఈ సర్వేలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి స్వయంగా తెలిపారు. ఇదిలావుంచితే, పార్టీ కేడర్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారనే చర్చ జరుగుతోంది.
Read Also- Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో గెలవకుంటే అధికారంలో ఉండి పార్టీ ప్రతిష్ట దిగజార్చుకున్నట్లవుతుందని, ఆ ఛాన్స్ ఇతర పార్టీలకు ఇవ్వొద్దని వ్యూహాత్మకంగా ముందుకుపోతోంది. బీఆర్ఎస్ సైతం ప్రత్యామ్నాయం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ కూడా ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకుని అధికార పార్టీకి సవాల్ విసిరిన విధంగానే ఈసారి కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేసి తమ సత్తా ఏంటో చాటాలని ఉవ్విళూరుతోంది. కానీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అభ్యర్థులు నిలబడేందుకు కూడా ఆసక్తి చూపడంలేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఆ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉండటంతో శ్రేణులు బరిలోకి దిగేందుకు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
Read Also- Asia Cup Trophy Row: ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకపోవడంపై నక్వీని నిలదీసిన బీసీసీఐ!
బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న జిల్లాల్లో తమను గెలిపించిన కార్యకర్తల గెలుపు కోసం శ్రమిస్తామని ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్నారు. గెలుపు బాధ్యతలు తమ నెత్తిపై మోపుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానికంగానే ఉండి లోకల్ బాడీ ఎలక్షన్ కు గ్రౌండ్ సిద్ధం చేసే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. కాగా పలు జిల్లాల్లో బీజేపీ.. లీడర్ ను కూడా తీర్చిదిద్దలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ టైంలో సర్వే చేసి గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించడం సాధ్యమవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కొన్ని చోట్ల గెలిచే అవకాశం లేకపోయినా, రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందకూడదని సూచించారు. వారికి పార్టీలో, ఇతర పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆశావహులకు మాత్రం ఈ నిర్ణయంతో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశముందని శ్రేణులు భావిస్తున్నాయి. కాగా కేడర్ లేని స్థానాల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి పార్టీ ఎలా గట్టెక్కుతుందనేది చూడాలి.