Bhatti Vikramarka: ఫామ్ హౌస్ నిద్ర వీడినా.. కేసీఆర్ తీరు మారలేదు
Bhatti Vikramarka (imagecredit:swetcha)
Telangana News

Bhatti Vikramarka: ఫామ్ హౌస్ నిద్ర వీడినా.. కేసీఆర్ తీరు మారలేదు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయి కాబట్టే, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు 85 శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం తల్లాడ మండలం పాత పినపాకలో పలు సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాటు ఫామ్ హౌస్‌లో పడుకొని, ఇప్పుడు బయటకు వచ్చి ‘తోలు వలుస్తాం’ అని కేసీఆర్ మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని మండిపడ్డారు. తోలు వలిచే ఉద్యోగం కేసీఆర్ ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని ఘాటుగా హెచ్చరించారు.

అసెంబ్లీకి రావడానికేం?

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్, రెండేళ్లుగా ఒక్క రోజైనా అసెంబ్లీకి ఎందుకు రాలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే కేసీఆర్‌కు భయమని, ప్రజల సమస్యలపై చర్చించే ధైర్యం లేకే ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీకి రాని ఆయనకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి హోదా అవసరం లేదా? అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ అవుతుంటే, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివస్తుంటే ఓర్వలేక కేసీఆర్ విషం కక్కుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 85 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని, ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం లభించలేదని అన్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయాలు చేయడంతోనే సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని భట్టి స్పష్టం చేశారు.

Also Read: RV Karnan: రెండేళ్ల పని పదేళ్లు చేస్తారా? ప్రాజెక్టుల విభాగంపై కమిషనర్ కర్ణన్ తీవ్ర అసహనం!

జేవీఆర్ ఓపెన్ మైన్ సందర్శన

అనంతరం సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్‌ను డిప్యూటీ సీఎం సందర్శించారు. మైన్ లోపలికి వెళ్లి బొగ్గు ఉత్పత్తి, రవాణా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల భద్రత, వేతనాలు, బొగ్గు నాణ్యత, మార్కెట్ ధరలపై సుదీర్ఘంగా సమీక్షించారు. కోల్ డిస్పాచ్ సెంటర్ పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సింగరేణి సంస్థను కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం చేయకుండా, ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతామని భట్టి అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో సింగరేణి నూతన జీఎం కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ప్రస్తుతం 45 వేల శాశ్వత ఉద్యోగులు, 40 వేల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధినిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు. మారుతున్న ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఇకపై రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు.

గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక ఫోకస్

పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తిలో సింగరేణి అగ్రస్థానంలో నిలవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వంతో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎంఓయూ కుదుర్చుకున్నామని, భవిష్యత్తులో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కూడా నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వేలం వేసే బొగ్గు బ్లాకులు బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద న్యాయం చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ సీఎం జేవీఆర్ ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించి బొగ్గు ఉత్పత్తి తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కట్టా రాగమయి, సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Also Read: RV Karnan: రెండేళ్ల పని పదేళ్లు చేస్తారా? ప్రాజెక్టుల విభాగంపై కమిషనర్ కర్ణన్ తీవ్ర అసహనం!

Just In

01

Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు నన్ను కలవండి.. అతని నెంబర్ ఇస్తా!

Bhatti Vikramarka: అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం… ప్రజా సంక్షేమమే లక్ష్యం.. భట్టి విక్రమార్క హెచ్చరిక!

Telangana state: సీఎం రేవంత్ ఖాతాలో మరో ఘనత.. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానం

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సిద్ధం.. ఈ కేసులో తదుపరి అడుగు ఏంటి?

Attempted Murder: తమ్ముడ్ని చంపిందన్న కసితో.. బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?