Bandi Sanjay: బెంగాల్, తమిళనాడు ఎన్నికల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి దృష్టిని తెలంగాణపైనే కేంద్రీకరించబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, దీనితో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యం సంపూర్ణమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించడం కార్యకర్తల త్యాగాల ఫలితమేనని బండి పేర్కొన్నారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం కార్యకర్తలపై దాడులు చేస్తున్నా, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ కమలం జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే బీజేపీ హైకమాండ్ దృష్టి అంతా తెలంగాణపైనే ఉంటుందని, మన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.
Also Read: Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్
కఠిన నిబంధనలు
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కోసం తనకైనా, లేదా తన కుటుంబ సభ్యులకైనా ఫోన్లు చేసి ఒత్తిడి తేవద్దని హెచ్చరించారు. పైరవీలు చేస్తే వచ్చే టికెట్లు కూడా కోల్పోతారని స్పష్టం చేశారు. కేవలం సర్వే రిపోర్టుల ఆధారంగా, గెలుపు గుర్రాలకే పార్టీ అధిష్ఠానం టికెట్లు ఇస్తుందని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగినా, క్రమశిక్షణ తప్పినా వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. టికెట్ రాని పక్షంలో ఆందోళన చెందవద్దని, నిబద్ధతతో పనిచేసే వారికి నామినేటెడ్ పోస్టుల ద్వారా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ, టికెట్ రాలేదనే నెపంతో పార్టీ వీడే వారి రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు మున్సిపాలిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read: Illegal Construction: వినతులు అందాయి.. అక్రమ కట్టడంపై సవారాన్ స్ట్రీట్ బాధితుడి ఆవేదన!

