Lancet Study: తెలంగాణ లోని గిరిజన గూడేల్లోని ప్రజల ఆరోగ్యానికి సంరక్షణగా ఆశాలు, ఏఎన్ ఎం(ANM)లు, అంగన్ వాడీలే కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను స్పష్టంగా పాటిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో గతంలో పోల్చితే ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోని ఆరోగ్య అలవాట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్(journal The Lancet) కూడా వివరించింది. ఈ కేటగిరీ ఉద్యోగులు కేవలం ప్రభుత్వ తరపున పనిచేయడమేకాకుండా, ప్రజలను మోటివేట్ చేయడంలో సక్సె స్ అయినట్లు వివరించారు. పర్యావరణ హితమైన ఆహారపు అలవాట్లను నేర్పించడం లో క్రియశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు స్టడీ చేశారు. కేవలం కాగితాల లెక్కలకే పరిమితం కాకుండా, పరిశోధకులు నేరుగా జనంలోకి వెళ్లి ఈ స్టడీని నిర్వహించారు. తెలంగాణలోని గిరిజనులు అధికంగా ఉండే ఆరు బ్లాకులుగా విభజించి అధ్యయనం చేశారు. పరిశోధకులు స్వయంగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులు, ఆశా వర్కర్ల పనితీరును దగ్గరుండి గమనించారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు స్థానిక గిరిజన మహిళలతో ‘సెమీ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలు’ నిర్వహించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. రోజు వారీ అనుభవాలను, సవాళ్లను, ఆరోగ్య పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు ఆధారంగా ఈ స్టడీ ని నిర్వహించారు.
సర్కారుకు.. గిరిజన సంస్కృతికి వారధులు
గిరిజన ప్రాంతాల్లో ‘పోషణ్ అభియాన్’ వంటి ప్రభుత్వ పథకాలు సక్సెస్ అయ్యాయంటే దానికి కారణం ఈ మహిళా కార్యకర్తలే. వీరు ఆఫీసర్లు చెప్పిన రూల్స్ ఉన్నది ఉన్నట్టుగా రుద్దకుండా, గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా మార్చి ప్రజలకు వివరిస్తున్నారు. గర్భిణులు, బాలింతల కోసం ఇళ్ల వద్దే ‘పోషక వనాలు’ పెంచడంతో పాటు అడవిలో దొరికే సంప్రదాయ ఆహార పదార్థాల గొప్పతనాన్ని వివరించడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు పర్యావరణాన్ని కాపాడుతున్నారు. సామాజికంగా, పర్యావరణపరంగా నిలకడగా ఉండే ఆహారపు అలవాట్లను వీరు ప్రోత్సహిస్తున్నారని లాన్సెట్ నివేదిక ప్రశంసించింది. త్వరలో దేశ వ్యాప్తంగా మరోసారి ఈ స్టడీ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తునట్లు తెలిసింది.
పని ఉంది.. గుర్తింపు ఏది?
పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఇంతటి బరువైన బాధ్యతలు మోస్తున్నా. ఈ మహిళా ఉద్యోగులకు వ్యవస్థాగతమైన ఆటంకాలు తప్పడం లేదు. పర్యావరణ ఆరోగ్యంపై వీరికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం ఒక లోపమైతే.. చేసిన పనికి సక్రమంగా రాని ప్రోత్సాహకాలు రావడం లేదని వాపోతున్నారు. అంతేగాక చాలీచాలని జీతాలు వీరిని కుంగదీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆరు నెలలకోసారి జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ఆరోగ్య, ఆర్ధిక వ్యవస్థను కాపాడటంలో కీలకంగా వ్యవహరించే ఈ ఉద్యోగులకు అండగా లేకపోతే భవిష్యత్ లో నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నదని ఎన్ఐ ఆర్ డీ(NIRD) ప్రభుత్వానికి ప్రత్యేక రిపోర్టు ఇచ్చింది. ఒకటి రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వ టీమ్ లు కూడా అన్ని రాష్ట్రాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో పర్యటనకు సిద్ధం కానున్నది.

