Congress Party: పాలకుర్తి నియోజకవర్గం నిత్యం ఏదో రకమైన వివాదంలో తెరపైకి వస్తూనే ఉంటుంది. పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి కార్యకర్తలతో సంబంధాలు బలహీనంగా మారిపోయాయి. కార్యకర్తలకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తలెత్తడం, అది రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీయడం గతంలో చూస్తూ వచ్చాం. తాజాగా మరోమారు ఇలాంటి పంచాయితే ఒకటి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
గురువారం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో పీఎంజీఎస్‌వై నిధుల ద్వారా మంజూరైన బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు గజ్జి దర్గయ్య, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు బీరెల్లి మహేందర్ రెడ్డి, ధర్మారపు మహేందర్‌ల అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఫ్లెక్సీలో తమ ఫొటోలు పెట్టి ఏర్పాటు చేసినప్పటికీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలకకపోవడంతో వివాదం చెలరేగింది.
నిలదీసిన నలుగురు
తమ అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటోలు ఎలా పెడతారంటూ నాగిరెడ్డి, దుర్గయ్య, మహేందర్ రెడ్డి, ధర్మారావులు హంగామా చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిని నిలదీశారు. దీంతో కొద్దిసేపు నేతలు, ఆ నలుగురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఝాన్సీ రెడ్డి ఆ నలుగురిపై చిర్రుబుర్రులాడారు. మరోవైపు వారి అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపైనా ఝాన్సీరెడ్డి, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎదురుతిరగడంతో శంకుస్థాపన కార్యక్రమం పూర్తిగా సైడ్ అయ్యి.. ప్రధాన అంశంగా మారిపోయింది.
Also Read: Student Sucide: చేతి వేళ్ల మధ్య పెన్సిల్ పెట్టిన టీచర్.. బాధతో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్
గతంలోనూ ఫ్లెక్సీల రభస
అయితే గతంలోనూ చెర్లపాలెం గ్రామంలో ప్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. పెరటి యాకూబ్ రెడ్డి, హనుమాండ్ల దేవేందర్ కూడా వారి ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టించేందుకు ప్రయత్నం చేస్తే ఏకంగా ఫ్లెక్సీలు తయారు చేసే నిర్వాహకుడికి ఫోన్ చేసి బెదిరించారని ఎప్పటి నాగిరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఫ్లెక్సీలో తమ ఫోటోలు పెడితే కేసులు పెడతామని హెచ్చరించినట్లుగా కూడా చెప్పారు. మొత్తానికి రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గం వర్గానికి సంబంధించిన వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక వర్గానికి కొమ్ముకాస్తూ మరో వర్గాన్ని పక్కనపెట్టి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

