Telangana Tourism: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని అనంతగిరి వచ్చే ఏడాది మార్చి 2026 నాటికి పర్యాటకులకు సరికొత్త గమ్యస్థానంగా మారనుంది. తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి (Ananthagiri) లో పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా 18 ఎకరాల విస్తీర్ణంలో 88 గ్లాంపింగ్స్ (టెంట్లతో కూడిన ఇళ్ల నిర్మాణం) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 38 కోట్లు మంజూరయ్యాయి. అనంతగిరిలో సహజ సౌందర్యం, దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. వీకెండ్స్‌లో ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అనంతగిరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. టూరిజం (Tourism) శాఖ ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపింది. 50.5 ఎకరాల్లో స్వదేశ్ దర్శన్ (Swadesh Darshan) కింద ఎకో టూరిజం అభివృద్ధికి కేంద్రం రూ. 38 కోట్లు మంజూరు చేయగా, టెండర్లు కూడా పూర్తయ్యాయి.
గ్లాంపింగ్స్ విశేషాలు
18 ఎకరాల్లో నిర్మించే 88 గ్లాంపింగ్స్ ఒక్కోటి సుమారు రూ. 4.31 లక్షల వ్యయంతో రూపొందనున్నాయి. ప్రతి ప్లాట్‌ఫారం సింగిల్ బెడ్రూం పరిమాణంలో ఉంటుంది. ఇందులో బెడ్‌రూం, అటాచ్డ్ బాత్రూం, కిచెన్, మూడు కుర్చీలు, సోఫా వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లాంతర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రకృతిలో ఇమిడిపోయేలా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకసారి వచ్చిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వచ్చేలా వసతులు కల్పించడమే లక్ష్యం. గ్లాంపింగ్స్ అద్దె, బుకింగ్ వివరాలపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Read Also- Hyderabad: భవిష్యత్తులో హైదరాబాద్‌లో బతకలేమా?
ఆహ్లాదానికి పెద్దపీట
18 ఎకరాల్లో గ్లాంపింగ్ ఏర్పాటు చేసే ప్రాంతం చుట్టూ 7.75 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు, పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించేందుకు 4.9 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు, అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించేందుకు 6 వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు, రెస్టారెంట్లు, రిసెప్షన్, ఇంటర్నల్ పాత్‌వేలు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక శాఖ తొలిసారిగా ఇలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నది.
అనంతగిరి సమీపంలో రూ. 100 కోట్లతో వెల్‌నెస్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరులోని జిందాల్ నేచురల్ క్యూర్ తరహాలోనే ఈ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం.
18 ఎకరాల్లో 88 ప్లాట్‌ఫారాలు
కొత్తదనంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలని భావించి గ్లాంపింగ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. పచ్చని పంట పొలాలతో కోటిపల్లి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అనంతగిరికి పర్యాటకుల ఆహ్లాదానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. 18 ఎకరాల్లో 88 ప్లాట్‌ఫారాలు నిర్మాణం చేయబోతున్నాం. రాబోయే కాలంలో తెలంగాణ అంటే టూరిజం అనేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది విజయవంతమైతే రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. దీనివల్ల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆశిస్తున్నాం- మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Also- Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం