Actor Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), సినీ నటుడు నాగార్జున మధ్య కొనసాగుతూ వస్తోన్న వివాదానికి నేటితో తెర పడింది. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో వేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. ఆయన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో డిఫమేషన్ కేసును వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొంతకాలంగా ఇరువురు మధ్య కొనసాగుతూ వస్తోన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.
ఎక్స్ వేదికగా క్షమాపణలు
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ‘టాలీవుడ్ మన్మథుడు’ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఎక్స్ వేదికగా బహిరంగం క్షమాపణలు చెప్పారు. తాను నాగార్జునను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ ఏ విధంగానూ బాధపెట్టే ఉద్దేశంతో చేయలేదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల వెనుక నాగార్జున గారి వ్యక్తిత్వాన్ని, కీర్తిని అవమానించాలనే దురుద్దేశం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున కి, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని బాధ కలిగి ఉంటే అందుకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం వేరైనా.. నాగార్జున, అక్కినేని ఫ్యామిలీని బాధించింది కాబట్టి వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
Also Read: ED Probe on Al Falah: అల్ ఫలా వర్సిటీ స్థాపించిన జావేద్ సిద్ధిఖీ గురించి ఆరా తీయగా సంచలనాలు వెలుగులోకి!
అసలేం జరిగిందంటే?
2024 అక్టోబర్ 2న హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ కారణంగా వారు విడాకులు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగింది. అక్కినేని ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ హీరో నాగార్జున నాంపల్లి కోర్టు డిఫేమేషన్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టు పరిధిలో నడుస్తూ వస్తోంది. పలుమార్లు ఇరుపక్షాలు నాంపల్లి కోర్టుకు సైతం వెళ్లి తమ వాదనలు వినిపించాయి.
Also Read: Delhi Blast: ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది ఎక్కడ?, ఎంత డబ్బుతో?, కెమికల్స్ ఎక్కడివి?.. వెలుగులోకి అసలు!
