Telangana ACB: వరంగల్ ఏసీబీ రేంజ్ లో వసూళ్ల సార్ గా పేరున్న అధికారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సదరు సార్ తోపాటు ఆయన బ్యాచ్ కు చెందిన మరికొందరు అధికారులు కలిసి రియల్ ఎస్టేట్ దందాలు(Real estate deals) కూడా చేస్తున్నట్టు తెలిసింది. వరంగల్ లో వీరిని ‘గచ్చిబౌలి బ్యాచ్’ అని పిలుస్తుంటారని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో(MRO)ను అరెస్ట్ చేసిన కేసులో కీలకపాత్ర పోషించిన ఏసీబీ అధికారి ఆ తరువాత తనదైన స్టయిల్లో వసూళ్లకు శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
లక్షలు వసూలు..
ఎమ్మార్వో నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లోని కాల్ లిస్ట్.. వాట్సాప్ ఛాటింగ్ లిస్టును సేకరించిన సదరు అధికారి వరుసగా ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ అరెస్టయిన అధికారికి మీరు బినామీలుగా ఉన్నట్టుగా తెలిసిందని లక్షలు వసూలు చేసినట్టుగా వార్తలొచ్చాయి. ఎమ్మార్వోతో పరిచయం ఉండి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తి నుంచి 20లక్షలు తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. హైదరాబాద్ కమిషనరేట్ లో పని చేస్తున్న ఆయన బ్యాచ్ మేట్ వరంగల్ వెళ్లి మరీ హన్మకొండలోని పిస్తా హౌస్ హోటల్ వద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి 20లక్షలు తీసుకుని ఏసీబీ(ACB)లో ఉన్న బ్యాచ్ మేట్ కు అందించినట్టుగా తెలియవచ్చింది. కాగా, వసూళ్ల సార్ వేధింపులు భరించలేక కొందరు ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి 20లక్షలు తీసుకున్న వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులను కూడా అందచేశారు.
Also Read: JNTU Nachupally Ragging: నాచుపల్లి జేఎన్టీయూలో.. కోరలు తెరిచిన ర్యాగింగ్ భూతం!
గచ్చిబౌలి బ్యాచ్..
కాగా, ఏసీబీ వరంగల్ రేంజ్ లో పని చేస్తున్న వసూళ్ల సార్ ఎవ్వరినీ వదిలి పెట్టరన్న ఆరోపణలు తాజాగా ముందుకొచ్చాయి. జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఎమ్మార్వో కార్యాలయాలు ఇలా ఎక్కడ అక్రమ ఆదాయం జనరేట్ అవుతుందో అక్కడి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగినా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం జరగక పోవటాన్ని దీనికి నిదర్శనంగా చెప్పవచ్చని అంటున్నారు.
మరో ముగ్గురు అధికారులు
ఇక, సదరు వసూళ్ల సార్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టుగా వరంగల్ పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంట్లో ఆయన బ్యాచ్ కు చెందిన మరో ముగ్గురు అధికారులు కూడా ఉన్నట్టుగా సమాచారం. ఈ నలుగురు తరచుగా గచ్చిబౌలి ప్రాంతంలో సమావేశమవుతూ వ్యాపార లావాదేవీలు జరుపుతుంటారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే వీరిని గచ్చిబౌలి బ్యాచ్ అని పిలుస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక, రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 20 లక్షలు తీసుకున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యింది. నివేదిక ఉన్నతాధికారుల వద్దకు చేరినట్టుగా సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్టుగా తెలిసింది.
Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!
