Aarogyasri Scheme: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం(Arogyasri Scheme) ప్రాణదాతగా నిలుస్తోంది. ముఖ్యంగా ఖరీదైన గుండె(Heart) సంబంధిత వ్యాధుల బారి నుంచి లక్షలాది మందిని ఆదుకుంటూ ‘గుండె’ ధైర్యాన్ని అందిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా చికిత్స అందించి పునర్జన్మనిస్తోంది.గత ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం గుండె చికిత్సల కోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటే, ఈ పథకం ఎంతమందికి అండగా నిలుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఎన్నో కుటుంబాలను ఈ పథకం కాపాడుతోంది. గతంలో గుండె సమస్యలు, జబ్బులు అనగానే భయాందోళనకు గురయ్యే పేదలు..ఇప్పుడు ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నదనే భరోసా పొందుతున్నారు. స్టంట్స్(Stunts) నుంచి ఆపరేషన్ల వరకు ఈ పథకం ద్వారా నిర్వహించి పేద ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపుతున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శ్రీ రేట్ల ను 22 శాతం పెంచారు. దీంతో ఈ కార్డు ద్వారా ఆపరేషన్లు కూడా పెరిగాయని ఆఫీసర్లు చెప్తున్నారు. వివిధ గుండె సమస్యల ప్రోసీజర్లకు ప్రతీ నెల సుమారు రూ. 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
చికిత్సల్లో అగ్రస్థానం..పేదలకు వరం
ఆరోగ్యశ్రీ పథకం కింద అందుతున్న చికిత్సల్లో గుండె సంబంధిత వైద్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అత్యధికంగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఇదే కావడంతో, ప్రభుత్వం కూడా నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తోంది. 2020 నుంచి ఇప్పటివరకు ఉన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఈ విభాగం ద్వారా 1,09,537 మందికి పైగా గుండె రోగులకు ఆరోగ్యశ్రీ అండగా నిలిచింది. వారి చికిత్సల కోసం ప్రభుత్వం రూ. 629.74 కోట్లు కేటాయించింది.దీంతో పాటు కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్(Cardiac and Cardiothoracic) వంటి క్లిష్టమైన గుండె ఆపరేషన్లను దాదాపుగా 27,730 మందికి ఈ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు.ఇందుకోసం రూ. 286.04 కోట్లు వెచ్చించారు. ఈ రెండు విభాగాల ద్వారానే లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని ఉచితంగా అందించి,వారిని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం గమనార్హం.
Also Read: Hyderabad: డీసీపీపై కత్తితో దాడి.. డీజీపీ, సీపీ సీరియస్.. రంగంలోకి 5 ప్రత్యేక బృందాలు
కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేస్తూ..
గుండె జబ్బుల చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. స్టంట్లు, పేస్‌మేకర్లు, ప్రత్యేక మందులు, క్యాథ్‌ల్యాబ్ వంటి అత్యాధునిక సాంకేతికత అవసరం. ఇవి సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భారంతో కూడుకున్నవి. అయితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఖరీదైన వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తోంది. లక్షలు ఖర్చయ్యే బైపాస్ సర్జరీలు, యాంజియోప్లాస్టీ(Angioplasty) వంటి చికిత్సలను కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందిస్తూ పేదల పాలిట వరంగా మారింది. గుండె సంబంధిత వ్యాధులకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. అత్యవసరమైన, ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్స అందించడంలో ఆరోగ్యశ్రీ ముందుండటం ప్రజలలో ఈ పథకంపై విశ్వాసాన్ని పెంచుతోంది. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా, ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందనడానికి ఈ గణాంకాలే నిలువుటద్దం. ఆరోగ్యశ్రీ అనేది కేవలం ఒక పథకం కాదు, లక్షలాది కుటుంబాలకు ఒక ధైర్యం, భరోసా అంటూ వైద్యాధికారులు వివరిస్తున్నారు.
Also Read: Election Commission: దేశవ్యాప్తంగా సమగ్ర ఓటరు జాబితా సవరణ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన
