Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తాజాగా మాట్లాడారు. దేశంలో ఏడాదికి నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. రూ.5 లక్షల ఖర్చుతో ఒక్కో ఇంటింని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.22 వేల కోట్ల రూపాయిలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.
అవినీతిగా ఆస్కారం లేకుండా..
హౌసింగ్ కార్పోరేషన్ 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను ఔట్ సోర్సింగ్ విభాగంలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. తాజాగా వారికి నియామక పత్రాలు అందజేసిన రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ నిబద్దతతో పనిచేయాలని సూచించారు. పేదవాడి చిరకాల కోరిక నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఇంజనీర్లకు విజ్ఞప్తి చేశారు. ఎంపికైన 350 మంది ఇంజనీర్లలో 45 శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి
దేశంలోని ఏ రాష్ట్రం ఒక సంక్షేమ పథకం కింద ఒక్క లబ్దిదారునికి రూ.5 లక్షల రూపాయిలు ఇస్తున్న దాఖలాలు లేవని మంత్రి పొంగులేటి అన్నారు. ఇండ్ల పథకాల్లో కూడా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయిలతో 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పథకాన్ని రూపొందించిందన్నారు.
కొద్ది రోజుల్లో జాబితా రెడీ
ఇందిరమ్మ ఇండ్ల కోసం కొద్దిరోజుల్లోనే నాలుగు లక్షల మంది జాబితా ఫైనల్ చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి స్ఫష్టం చేశారు. విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురికాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా క్షేత్రస్ధాయిలో పనిచేయాలని అన్నారు. అటు ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో ఎలాంటి మధ్యవర్తులు ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్నలబ్గిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.
Also Read: Dost Registration 2025: గుడ్ న్యూస్.. నేటి నుంచే అప్లికేషన్స్.. ఇలా అప్లై చేయండి!
సర్టిఫికేట్లు అందజేత
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులు పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించారు. వీరికి సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత సర్టిఫికేట్లను అందజేశారు.