15th Finance Commission: కేంద్రం పెడుతున్న నిబంధనలతో గ్రామ పంచాయతీలకు ఇబ్బందులు తప్పడం లేదు. 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద ప్రతి నెలా రూ.180కోట్లు మంజూరు చేస్తుంది. అయితే పంచాయతీలకు పాలకవర్గాలు లేవనే సానుకుతో నిధులను నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడంతో సుమారు 3వేలకోట్ల మేర నిలిచిపోయాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ నుంచి సైతం మరో రూ.1200కోట్లు కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామ ప్రత్యేకాధికారులు, గ్రామకార్యదర్శులు మౌలిక వసతుల కల్పన కోసం రూ.70కోట్లకు పైగా సొంతంగా ఖర్చు చేసినట్లు సమాచారం.
Aslo Read: King Nagarjuna: తనతో సినిమా చేయమని దర్శకుడి వెంట పడ్డ కింగ్..? ఆ తోపు దర్శకుడు ఎవరంటే?
అసలు కథ ఇదీ..
రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం ప్రతినెలా రూ.180కోట్లు రావాల్సి మంజూరు చేస్తుంది. గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు పెడుతున్నది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే నిధులను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. సర్పంచుల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహణలో జాప్యంతో కేంద్రం 15వ ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. క్షేత్రస్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన దాదాపు రూ.2,991 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. అందులో 2024-25లో టైడ్ (టైడ్ గ్రాంట్లు అంటే ఇవి ప్రధానంగా త్రాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల కోసం వినియోగించాలి.
అదేవిధంగా, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) స్థితిని కొనసాగించడం, నీటి నిర్వహణ, వర్షపు నీరు నిల్వ, నీటి పునర్వినియోగం, గృహ వ్యర్థాల శుద్ధి వంటి పనులకూ ఈ నిధులు ఉపయోగించవచ్చు), అన్-టైడ్(అన్-టైడ్ గ్రాంట్లు అంటే రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన ప్రాథమిక అవసరాల కోసం ఈ నిధులను వినియోగించవచ్చు. అయితే, జీతాలు లేదా ఇతర కార్యాలయ ఖర్చులకు మాత్రం ఉపయోగించకూడదు) గ్రాంట్ల కింద 1, 2 వాయిదాల్లో రూ.1514కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1477కోట్లు కేటాయించింది. కానీ విడుదల చేయలేదు.
ససేమీరా..
కేంద్రం 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రోజులు గడుస్తున్నాయే తప్ప నిధుల విడుదలతో మాత్రం జాప్యం జరుగుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం రూ.1,514 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
అందులో జిల్లా పరిషత్‌లకు టైడ్ కింద 45.42కోట్లు, అన్-టైడ్ కింద 30.28కోట్లు ఫస్ట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మొత్తం రూ.75.70కోట్లు ఇవ్వాల్సి ఉంది. మండల ప్రజాపరిషత్ కింద టైడ్ కింద రూ.90.84కోట్లు, ఆన్ టైడ్ కింద రూ.60.56కోట్లు మొత్తం 151.40కోట్లు, గ్రామపంచాయతీలకు టైడ్ కింద రూ.772.14కోట్లు, ఆన్-టైడ్ కిం 514.76కోట్లు(ఫస్ట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్లు) మొత్తం రూ.1286.90 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిల్లా, మండల, గ్రామపంచాయతీలకు రూ.1514కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం బడ్జెట్‌లో సైతం పేర్కొన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
ఎందుకిలా..?
అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.789.50కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో టైడ్ కింద జిల్లా ప్రజాపరిషత్‌లకు టైడ్ కింద 22.16కోట్లు, ఆన్-టైడ్ కింద రూ.14.77కోట్లు మొత్తం రూ.36.93కోట్లు, మండల ప్రజా పరిషత్ కింద టైడ్ కింద రూ.44.31కోట్లు, అన్‌టైడ్ కింద 29.54కోట్లు మొత్తం రూ.73.85కోట్లు, అదే విధంగా గ్రామపంచాయతీలకు టైడ్ కింద 376.63కోట్లు, అన్ -టైడ్ కింద 251.09కోట్లు మొత్తం రూ.627.72 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. జిల్లా, మండల, గ్రామపంచాతీలకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.738.50కోట్లు పెండింగ్‌లో పెట్టింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు త్రైమాసికాలు ముగుస్తున్నా, ఇప్పటి వరకు నిధులు విడదల చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతుంది.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
నిధుల లేమితో ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా మరో రూ.1200కోట్లు రావల్సి ఉంది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించకుంటే, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్‌గా రావల్సిన మరో రూ.1,200 కోట్లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ నిధుల నిలిపివేతతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
కొన్ని పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేకాదు నిధుల లేమితో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల, గ్రామపంచాయతీలో ట్రాక్టర్ల నిర్వహణ, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా కష్టంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికైనా నిర్వహించపోతే మొత్తంగా దాదాపు రూ.4,200 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కేంద్రం నిధులు విడుదల చేస్తే పంచాయతీలు అభివృద్ధి బాటపట్టనున్నాయి.
అప్పు తెచ్చి మరీ..
పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వారి పాలనే సాగుతుంది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు సైతం మౌలిక సదుపాయల కల్పన బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దీంతో గత 18 నెలల నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు అప్పులు తెచ్చిమరి పనులు చేపడుతున్నారు. దీంతో సుమారు 70 నుంచి 100కోట్ల వరకు పనులు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన బిల్లులను సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే తప్ప కేంద్రం నుంచి 15వ ఆర్ధికసంఘం నిధులు వచ్చేలా లేవు.