Motorola: మోటరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘Signature’ ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లెనోవో అనుబంధ సంస్థ అయిన మోటరోలా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సబ్-పేజీ నుంచి ఈ డివైస్‌ను టీజ్ చేస్తూ, డిజైన్, ప్రీమియం ఫీచర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది.
మోటరోలా సిగ్నేచర్.. ఏం ఉంటుందని ఆశిస్తున్నారు?
మోటరోలా సిగ్నేచర్ సిరీస్ కంపెనీ లైనప్‌లో పూర్తిగా కొత్తగా చేరనుండటం విశేషం. అందువల్ల ఇది ఏ సెగ్మెంట్‌లో నిలుస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా, లీక్ అయిన స్పెసిఫికేషన్లు మాత్రం దీన్ని ప్రీమియం క్యాటగిరీ డివైస్‌గా సూచిస్తున్నాయి.
ఇటీవల గీక్‌బెంచ్‌లో కనిపించిన లీక్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇదే చిప్‌సెట్ OnePlus 15Rలో కూడా వాడుతున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్‌లో 3.32GHz వేగంతో పనిచేసే ఆరు కోర్లు, 3.80GHz వేగంతో రెండు హై-పర్ఫార్మెన్స్ కోర్లు ఉండనున్నాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 829 GPU ఇవ్వనున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ 2023లో వచ్చిన Snapdragon 8 Gen 3 కంటే మెరుగ్గా ఉండగా, గత ఏడాది ఫ్లాగ్‌షిప్ అయిన Snapdragon 8 Elite కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ & మెమరీ
మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత Hello UIతో రానుందని లీక్‌లు చెబుతున్నాయి. ఇది స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గరగా ఉండే UI అయినప్పటికీ, ఇటీవల మోటరోలా ఇందులో కొంతమేర యాడ్స్, బ్లోట్‌వేర్‌ను కూడా జోడిస్తోంది. అదనంగా, ఈ డివైస్‌లో 16GB RAM ఉండే అవకాశం ఉండటం వల్ల, ఇది హైఎండ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
డిజైన్ & డిస్‌ప్లే
ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన రెండర్స్ ప్రకారం, మోటరోలా సిగ్నేచర్ ఫోన్ Carbon మరియు Martini Olive అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఫోన్ వెనుక భాగంలో కర్వ్‌డ్ ఎడ్జెస్‌తో పాటు కర్వ్‌డ్ డిస్‌ప్లే డిజైన్ ఉండనుంది. ముందు భాగంలో 6.7 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read : Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్
ధర & పోటీ
ఇప్పటి వరకు అధికారిక ధర వివరాలు వెల్లడి కాలేదు. అయితే Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ధర ప్రీమియం రేంజ్లో ఉండే అవకాశం ఉంది. మోటరోలా సిగ్నేచర్ సిరీస్, త్వరలో లాంచ్ కానున్న OnePlus 15R, Oppo Reno 15 సిరీస్, Realme 16 Pro సిరీస్ వంటి ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని చెబుతున్నారు.

