Google Gemini App: Gemini 3 Proను ఇటీవలే విడుదల చేసిన Google, ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. డిసెంబర్ 17న Gemini 3 Flash అనే కొత్త AI మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్‌ను Gemini యాప్‌లో డిఫాల్ట్ AI మోడల్‌గా కూడా సెటప్ చేయడం గమనార్హం.
Google ఉచిత వినియోగదారులకు ‘Thinking’ మోడల్‌పై పరిమిత ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తోంది. అయితే, మిగిలిన ప్రశ్నలు అన్నీ నాన్-రిజనింగ్ మోడల్‌కు మారతాయి. ఈ మోడల్‌ను Gemini యాప్‌లో ‘Fast’ అనే పేరుతో చూపిస్తున్నారు.
Gemini 3 Flashలో కొత్తదేమిటి?
Gemini 3 Flash, గతంలో ఉన్న Gemini 2.5 Pro కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని Google వెల్లడించింది. అంతేకాదు, చాలా తక్కువ ఖర్చుతోనే ఇది అధిక పనితీరును అందిస్తోందని కంపెనీ చెబుతోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. Gemini 2.5 Pro మోడల్ గత కొన్ని నెలలుగా వివిధ బెంచ్‌మార్క్‌లలో టాప్ ర్యాంక్‌లో కొనసాగింది. అయితే, గత నెలలో Google Gemini 3 Pro మోడళ్లను విడుదల చేయడంతో ఆ ఆధిపత్యం ముగిసింది. Humanity’s Last Exam బెంచ్‌మార్క్‌లో Gemini 3 Flash 33 శాతం స్కోర్ సాధించింది. ఇది Grok 4.1 Fast (17.6%), Claude Sonnet 4.5 (13.7%) కంటే చాలా ముందుండగా, GPT-5.2 (34.5%)కి మాత్రం స్వల్పంగా తక్కువగా నిలిచింది.
కోడింగ్, విజువల్ రీజనింగ్‌లోనూ దూసుకుపోతున్న Gemini 3 Flash
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన పనితీరును కొలిచే SWE-bench Verified టెస్ట్‌లో Gemini 3 Flash 78 శాతం స్కోర్ సాధించింది. ఇది Claude 4.5 Sonnet (77.2%)ను దాటగా, GPT-5.2 (80%)కు చాలా దగ్గరగా నిలిచింది. ఇక విజువల్ రీజనింగ్‌కు సంబంధించిన ARC-AGI-2 బెంచ్‌మార్క్‌లో అయితే Gemini 3 Flash మరింత మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ విభాగంలో ఇది Claude, Gemini 2.5 Pro మాత్రమే కాదు, తాజా Gemini 3 Pro మోడల్‌ను కూడా మించి ప్రదర్శన చూపించింది.
Google వివరణ ప్రకారం, Gemini 3 Flash అవసరాన్ని బట్టి తన ఆలోచనా స్థాయిని మార్చుకుంటుంది. క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువగా ఆలోచిస్తే, సాధారణ పనులకు తక్కువ టోకెన్లతోనే సమాధానాలు ఇస్తుంది. వాస్తవ వినియోగంలో చూసుకుంటే, ఇది Gemini 2.5 Proతో పోలిస్తే సగటున 30 శాతం తక్కువ టోకెన్లు వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు ఇస్తోందని కంపెనీ తెలిపింది.
Gemini 3 Flashను ఎక్కడ ఉపయోగించొచ్చు?
Gemini 3 Flash ఇప్పటికే Gemini యాప్‌లో డిఫాల్ట్ మోడల్‌గా అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించేందుకు వినియోగదారులు అదనంగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, Google Searchలోని AI Modeకూ ఇదే మోడల్ శక్తినిస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి వినియోగదారులు Perplexityలా సంభాషణ రూపంలో ప్రశ్నలు అడగవచ్చు.
Google చెప్పిన ప్రకారం, Gemini 3 యొక్క మల్టీమోడల్ రీజనింగ్ సామర్థ్యం వినియోగదారులకు సమాచారం త్వరగా అర్థం చేసుకునేలా చేస్తుంది. వీడియోలు, చిత్రాలు, ఆడియో వంటి ఏ రకమైన డేటానైనా Gemini విశ్లేషించి, వాటి ఆధారంగా కొన్ని సెకన్లలోనే ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ను కూడా రూపొందించగలదని కంపెనీ పేర్కొంది.

