Monday, October 14, 2024

Exclusive

Local Parties: ప్రాంతీయ పార్టీలపై చిన్నచూపెందుకు?

Regional Parties To Underestimate: దేశంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో మరోసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. గత పదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ మాట చెల్లుబాటవుతూ రావటంతో ప్రాంతీయ పార్టీల వాణి, స్థానిక ఆకాంక్షలకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. పైగా, ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలూ బాగానే జరిగాయి. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ పార్టీలేనని, జాతీయ భావనలకు, జాతి ప్రయోజనాలకు అక్కడ ఎలాంటి ప్రాధాన్యతా లేదనే ప్రచారమూ జోరుగా జరిగింది. గడచిన దశాబ్దకాలంలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’, ‘ఒకే దేశం.. ఒకే సంస్కృతి’ వంటి నినాదాలకు పదును పెట్టిన బీజేపీ.. ప్రాంతీయ ఆస్తిత్వాలను, దేశపు బహుళత్వపు విలువలను, క్షేత్రీయ ఆకాంక్షల విలువను తగ్గించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది. అయితే, ఇదే సమయంలో ఒక జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, దాని అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి భిన్నంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా సాగిన ఆయన యాత్రలో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవటమే గాక ఆయా ప్రాంతాలలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆయన గౌరవించారు. తద్వారా ఈ దేశపు బహుళత్వ విలువలకు తాము కట్టుబడి ఉంటామనే భరోసాను ప్రజలకు కల్పించగలిగారు. దీని ప్రభావం 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించింది. గత దశాబ్ద కాలంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలను అడుగడుగునా ఇబ్బంది పెట్టిన బీజేపీ చివరకు తమ ప్రాంత ఆకాంక్షలను బలంగా వినిపించే ఆ పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చింది.

ఇక.. మన దేశంలో ప్రాంతీయ పార్టీల చరిత్రను పరిశీలిస్తే, కొందరు చెబుతున్నట్లుగా అవి కేవలం రాజ్యాధికారమే లక్ష్యంగా పుట్టుకురాలేదని, వాటికి స్పష్టమైన రాజకీయ, సామాజిక, అభివృద్ధి తదితర ఎజెండాలు ఉన్నాయని అర్థమవుతుంది. తెలుగు అస్తిత్వం, తెలుగువారి ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదాలతో ఎన్టీఆర్ నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 42 సంవత్సరాల నాడు ఆవిర్భవించిన ఆ పార్టీ ప్రయాణంలో ఎన్నో ఉత్థానపతనాలున్నప్పటికీ, నేటికీ అది తెలుగునేలపై తన ప్రభావాన్ని చాటుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న నాటి బొంబాయి నగరంలో గుజరాతీలు, తమిళులు, ఉత్తరాది వారి పెత్తనాన్ని నిలదీసే ప్రయత్నంలో ప్రారంభమైన శివసేన పార్టీ, కాలక్రమంలో బలమైన హిందుత్వవాసనలనూ అద్దుకుని 58 ఏళ్లుగా మరాఠా రాజకీయాలను శాసిస్తూనే ఉంది. జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా వంటి నేతల భావజాలమే ఉత్తర ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలలో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలకు పునాది అయింది. వీటికి లోహియా శిష్యులైన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వం వహించారు. ప్రాంతీయ సామాజిక న్యాయం, లౌకిక వాదమే తమ పార్టీలకు ఆలంబనగా వారు చెప్పుకున్నారు. జాతీయోద్యమానికి కేంద్రస్థానంగా, 1947 నాటికి పారిశ్రామికీకరణలో దేశంలోనే మందున్న రాష్ట్రంగా పేరొందిన బెంగాల్ రాష్ట్రపు సాంస్కృతిక, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైన కారణంగానే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పుట్టుకొచ్చింది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అన్నాదురై నాయకత్వంలోని తమిళ భాష, సంస్కృతుల పరిరక్షణే లక్ష్యంగా డీఎంకే పార్టీ ఆవిర్భవించగా, దానిలో వచ్చిన చీలికగా అన్నాడీఎంకే పుట్టుకొచ్చింది. ఈ రెండు పార్టీల ధాటికి గత అర్థశతాబ్ద కాలంగా ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు అధికారానికి దూరమై, ఈ రెండు ద్రవిడ పార్టీల ప్రాపుకై ఎదురుచూడాల్సి వచ్చింది. దళితుల గుండె ఘోషకు గొంతుకగా కాన్షీరాం నాయకత్వంలో యూపీలో పుట్టి, జాతీయ స్థాయిలో ప్రభావం చూపే బీఎస్పీ, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ బిజూ పట్నాయక్ పెట్టిన బిజూ జనతాదళ్, తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన బీఆర్ఎస్, సుపరిపాలనే లక్ష్యంగా కేజ్రీవాల్ నాయకత్వంలో వచ్చిన ఆప్, జనతా పార్టీ చీలికల నుంచి పుట్టిన జేడీయూ, జేడీఎస్.. ఇలా ఎన్నో పార్టీలు తమ ప్రాంతాలలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే తమ ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉన్నాయి.

Also Read: నీట్ పరీక్ష.. నూరు అనుమానాలు

జాతీయ స్థాయిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పనేమిటి? వాటికి జాతీయ దృక్పథం, సిద్ధాంతాలు, ప్రణాళికలు లేవు కదా? అవి రాష్ట్రాలకే పరిమితమైతే సరిపోతుంది కదా? వాటి వల్ల ఓట్లు చీలి జాతీయ రాజకీయ స్వరూపమే మారి, జాతి సమగ్రత ప్రమాదంలో పడుతోంది కదా? అనే ప్రశ్నలను గత పదేళ్లలో అనేక సార్లు బీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వినిపిస్తూ వచ్చారు. అయితే, ఈ వాదన తప్పని తెలుగునేల మీద పుట్టిన ఇద్దరు సమకాలీనులలైన నాయకులు నిరూపించారు. జాతీయ భావాలు గల ప్రాంతీయ నేతగా ఎన్‌టీఆర్, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించిన సూదిని జైపాల్ రెడ్డి ఇందుకు మంచి ఉదాహరణలు. తెలుగు గంగ పథకాన్ని ప్రారంభించి, తెలుగునేలకు దఖలు పడిన కృష్ణా జలాల్లో కొంత వాటాను చెన్నై‌ నగరం కోసం స్వచ్ఛందంగా వదులుకుని, అక్కడి ప్రజల దాహార్తిని తీర్చిన నేతగా ఎన్‌టీఆర్ గుర్తింపు పొందారు. తెలుగువాడైన పీవీ ప్రధానిగా ఎన్నికైన వేళ.. పోటీ లేకుండా లోక్‌సభకు పంపాలని నిర్ణయించిన చరిత్రా ఆయనకు ఉంది. అదే విధంగా, కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, స్వరాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, దానికి మద్దతు పలికిన నేతగా సూదిని జైపాల్ రెడ్డి తనకు ఆఫర్ చేసిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వాన్ని కూడా వదులుకున్నారు. ఇదే సమయంలో అదే సమయంలో రాష్ట్రాలను తమ సంస్థానాలుగా మలచుకుని, తమ ప్రాంతీయ పార్టీలను ఫక్తు కుటుంబ పార్టీలుగా మార్చుకున్న ప్రాంతీయ పార్టీల నేతలూ లేకపోలేదు. కేంద్రంలోని సంకీర్ణాలకు సంఖ్యా బలం కొరవడినప్పుడు తమ మద్దతు తెలిపి, అక్రమార్జనకు పాల్పడి, తర్వాతి రోజుల్లో జైలు పాలైన నేతలనూ దేశం చూసింది. బీహార్‌లో లాలూ, తమిళనాడులో జయలలిత, కరుణానిధి, శశికళ, హర్యానాలో ఓంప్రకాశ్​ చౌతాలా వంటి ఎందరో ఈ జాబితాలో ఉన్నారు. అయితే, వీరిని ఉదాహరణలుగా చూపి, ప్రాంతీయ పార్టీలన్నింటికీ జాతీయ దృక్పథమే లేదనటం సరికాదు.

జాతీయ పార్టీలుగా చెప్పుకునే వాటికి ఉన్న జాతీయ దృక్పథం ఎంత అనేది కూడా ఈ సందర్భంగా మనం పరిశీలించాలి. ఒకవైపు ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా విమర్శిస్తూ.. మరోవైపు మైనారిటీలను పూర్తిగా విస్మరిస్తూ, వారిని శత్రువులుగా చిత్రీకరిస్తూ, వారికి ఎన్నికల్లో ఒక్క టిక్కెట్టూ ఇవ్వకుండా దూరం పెట్టటమే గాక, వారికి రాజ్యాధికారంలో వాటాయే లేకుండా చేసిన బీజేపీని జాతీయ పార్టీగా అంగీకరించటం, వీరి సిద్ధాంతంలో జాతీయ దృక్పథం ఉందని నమ్మటం కష్టమే. ఎన్నో జాతులు, భాషలు, అనేక విషయాలలో వైవిధ్యం గల దేశాన్ని ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే బాటన నడిపించాలని జాతీయ పార్టీగా బీజేపీ తాపత్రయపడటమంటే.. అది ఈ దేశపు రాజ్యాంగం ప్రవచించిన ఫెడరల్ స్ఫూర్తిని నిరాకరించటమే. కనుక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా ఉన్న సమాఖ్య భావన పదికాలాల పాటు నిలబడాలంటే రాష్ట్రాల ఆకాంక్షలను, వాటిని ప్రాతినిధ్యం వహించే పార్టీలను జాతీయ వాద పార్టీలు గుర్తించి, గౌరవించటం ఎంతైనా అవసరం. ఒకే దేశం- ఒకే జాతి అంటూనే మరోవైపు ఒక వర్గాన్ని శత్రు భావనతో చూసే ధోరణి గల పార్టీలేవీ ఇక.. జాతీయ పార్టీలుగా చెప్పుకోవటం సాధ్యం కాదు. కనుక ఈ విషయంలో వైవిధ్యంలోనూ, భిన్నత్వంలోనూ ప్రత్యేకత, బలం ఉందని నమ్మే ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు గౌరవించి, కలుపుకుని పోతేనే దేశం ముందుకు పోతుంది. ఈ వాస్తవాన్ని కేంద్రంలోని ఎన్డీయేకి నాయకత్వం వహించేవారు తెలుసుకుంటే రాబోయే కాలంలో దేశంలో అనేక సానుకూల మార్పులనూ మనం చూడటం సాధ్యమవుతుంది.

– జర్నలిస్ట్ రాజు

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...