– అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచాం
– ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించాం
– వచ్చే ఎన్నికల్లో 88 సీట్లే టార్గెట్
– తాజా ఫలితాలే అందుకు నిదర్శనమన్న కిషన్ రెడ్డి
– బీఆర్ఎస్ పని అయిపోయింది..
– కాంగ్రెస్‌పై నమ్మకం పోయిందంటూ విమర్శలు
Telangana BJP: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాష్ట్రంలో మంచి ఫలితాలను సాధించిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో తమ అభ్యర్థి రఘునందన్ రావు గొప్ప ఫలితాలను రాబట్టారని తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేసినా ప్రజలు అరవింద్‌కే పట్టం కట్టారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తమపై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీనే విశ్వసించారని పేర్కొన్నారు.
ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుకు సంకేతాలని, త్వరలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నదని చెప్పిన కిషన్ రెడ్డి, లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని విశ్లేషించారు. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మరింతగా ముందుకు వెళ్తామని వివరించారు. ఇక బీజేపీ రెండో స్థానంలో నిలిచిన మరో ఆరు పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లోనూ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉందని తెలిపారు.
మల్కాజ్‌గిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో చేవెళ్లలో ఆరు సెగ్మెంట్‌లలో, కరీంనగర్‌లో ఆరు, ఆదిలాబాద్‌లో ఆరు, నిజామాబాద్‌లో ఐదు, సికింద్రాబాద్‌లో ఐదు, మహబూబ్‌నగర్‌లో నాలుగు,, మెదక్‌లో రెండు, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరిచిందని వివరించారు. ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తామని చెప్పారు.
‘‘మొన్న 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. ఇప్పుడు 8 ఎంపీ సీట్లు సాధించాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడటం, ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న పరిస్థితుల్లో రాజకీయ శూన్యత నెలకొందని, ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఏర్పడటానికి ప్రజలు అవకాశం ఇస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు.