– సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రుల బృందం
– వేగంగా పనులు.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు
– ప్రాజెక్టుల పేరిట గత ప్రభుత్వం నిధుల దుర్వినియోగం
– వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదు
– డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల ఫైర్
Ministers Visit: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సమస్యలను, ముఖ్యంగా సాగు నీటి సమస్యలను పరిష్కరించాలని వడిగా చర్యలు తీసుకుంటున్నది. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు బయటపడటంతో సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. సీతమ్మ సాగర్ ఆనకట్ట నిర్మాణం, క్రాస్ రెగ్యులేటర్ పంప్ హౌజ్ పనులను మంత్రులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు వ్యూ పాయింట్ పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములకలపల్లి మండలం పూసుగూడెం ప్రాంతంలోని రెండో పంప్ హౌజ్‌ను సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు మాట్లాడారు.
గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులపై చాలా అన్యాయం చేశారని, అంచనాలు పెంచి నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందించలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తయ్యాక సీతారామ ప్రాజెక్టు కెనాల్‌కు రాజీవ్ కెనాల్ అని నామకరణం చేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీటి చుక్క ఇవ్వలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే రివ్యూ చేసి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా కార్యచరణ రూపందిస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి నల్లగొండ, వైరా ప్రాంతాల్లోని లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, ఈ వానాకాలంలోనే గోదావరి జలాలను పంట పొలాలకు అందిస్తామని హామీ ఇచ్చారు.