– కోడ్ ముగియగానే అర్హులకు కొత్త రేషన్ కార్డులు
– పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం
– వ్యవసాయానికి కూడా ప్రణాళికలు.. సాగు నీరు కొరత లేకుండా చర్యలు
– ఏ సమస్య అయినా నాకు చెబితే పరిష్కరిస్తా: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వారి సమస్యలు ఆలకించి తగిన పరిష్కారాలు చూపుతున్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామానికి వెళ్లారు. ప్రజలను కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమది బీఆర్ఎస్‌లా మోసపూరిత ప్రభుత్వం కాదని, మాటకు కట్టుబడి నిలిచే ప్రజా ప్రభుత్వం అని వివరించారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ప్రతి మాటను తీరుస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో పేదవారికి ఒక్క ఇల్లు కూడా రాలేదని విమర్శించిన మంత్రి పొంగులేటి ఈ ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తానని, ఇళ్ల భూములు కేటాయిస్తామని చెప్పారు. పింఛన్లు ఎప్పటిలాగే అందిస్తామని వివరించారు. గ్రామాల్లో అంతర్గత దారుల, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాగు నీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే తాగు నీటి కటకటాలు రాకుండా చూస్తానని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే, వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలనూ తయారు చేస్తున్నామని, వచ్చే వానా కాలంలో పాలేరు రిజర్వాయర్‌లో నీరు లేకున్నా సాగు నీటికి ఇబ్బందులు రాకుండా పరిష్కరిస్తామని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు ఎవరూ అధైర్య పడొద్దని, ఎటువంటి సమస్య వచ్చినా తనకు చెబితే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. ‘మీ ఇంటిలో పెద్ద కొడుకుగా ఉండి మీ అందరి సమస్యలు తీరుస్తాను’ అని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.