– తెలంగాణ బిల్లు ఆమోదంలో బీజేపీది కీలక పాత్ర
– ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొంది
– అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? స్పష్టత ఇవ్వాలి
– కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మచ్చిక చేసుకున్న కేసీఆర్
– త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ సీక్రెట్ డీల్
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
Telangana Formation Day: తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసు అని, ఇక్కడ ఉద్యమకారుల ఆత్మహత్యలు ఆపేలా సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని వివరించారు. పార్లమెంటులో ఆందోళన, పెప్పర్ స్ప్రే వంటి ఘటనలు జరుగుతుంటే.. బీజేపీ బిల్లు ఆమోదం పొందేలా సహకరించిందని తెలిపారు. కాగా, ఈ సభకు కేసీఆర్ రానేలేదని, తెలంగాణ బిల్లుకు ఓటు కూడా వేయలేదని అన్నారు. ఇక ఉద్యమంలోనూ బీజేపీ నేతలు క్రియాశీలక పాత్ర పోషించారని, కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ ఉద్యమంలో పాల్గొందని వివరించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి.. బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో వివరించాలని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఆహ్వానించడంలో చూపిన ఉత్సాహం బీజేపీ నేతలపట్ల ఎందుకు లేదని ప్రశ్నించారు. కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు ఒకే వేదిక మీద కూర్చోబోతున్నారని పేర్కొంటూ హస్తం పార్టీ అధినాయకత్వాన్ని మాజీ సీఎం మచ్చిక చేసుకున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, ఈ మేరకు రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. బీజేపీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తూ.. ఇది అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అనేది స్పష్టం చేయాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధినాయకత్వంతో కేసీఆర్‌కు డీల్ కుదిరిందని, అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదని బండి సంజయ్ ఆరోపించారు. అప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నదని అన్నారు. తెలంగాణలో దోచుకున్న డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని ఆరోపించారు. ఇక అధికారిక చిహ్నం మార్పు గురించి ప్రస్తావిస్తూ.. చిహ్నంలో చార్మినార్ ఉండొద్దనేది మొదటి నుంచీ తమ విధానం అని తెలిపారు. ఇప్పుడు కూడా అదే అంటున్నామని, అయితే.. అమరవీరుల స్తూపాన్ని చేర్చడంపై అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు.