Seethakka, Surekha
Politics

Telangana:మేం కలిసే ఉన్నాం

Warangal District woman ministers Konda Surekha Seethakka:
తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్, దినపత్రికలో వచ్చిన కథనాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ మహిళా మంత్రులు స్పందించారు. తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు సీతక్క, కొండా సురేఖ సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కావాలనే కొన్ని వ్యతిరేక శక్తులు తమపై బురదజల్లే చర్యలకు పాల్పడుతూ అదోరకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా సాధికారతకు ప్రాముఖ్యం అన్నారు. మహిళా సాధికారతను చేతల్లో చూపుతోందని అన్నారు. బీఆర్ఎస్ వంటి బూర్జువా పార్టీలు తమ ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

జర్నలిజం ముసుగులో

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్దిరాలేదన్నారు.
జర్నలిజం ముసుగులో బీఆర్‌ఎస్ సొంత మీడియా కాంగ్రెస్‌కు వ్యతిరేక వార్తలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయని మంత్రులు సురేఖ, సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గిరిజన బిడ్డ సీతక్క, బీసీ బిడ్డ అయిన తాను ఎదుగుతున్న తీరును చూసి తట్టుకోలేని ఫ్యూడలిస్టులు అవాస్తవ కథనాలతో విషం చిమ్ముతున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా జిల్లా ప్రగతికి, రాష్ట్ర పురోగతికి తమవంతు కృషి చేస్తూ కలిసి సాగుతున్నట్లు చెప్పారు.

మహిళాశక్తిని కించపరచడమే

తమపై అసత్య ఆరోపణలు చేయడం మహిళాశక్తిని కించపరచడమేనని మంత్రులు సీతక్క, సురేఖ అన్నారు. మేడారం జాతరలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశాల్లో, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో తాము ఇరువురం కలిసికట్టుగా పనిచేశామన్నారు. మేడారం జాతర సమయంలో తాను విపరీతమైన జ్వరంతో బాధపడ్డానని, తిరిగి కోలుకొని అమ్మవార్లు గద్దెకు చేరుకున్న సమయంలో జాతరకు హాజరైన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. తానూ, మంత్రి సురేఖ పరస్పరం సహకరించుకుంటూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి, విజయవంతంగా జాతరను ముగించామని మంత్రి సీతక్క అన్నారు.

ఎన్నికల కోడ్ వల్లే

పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఎవరికివారు ప్రచార కార్యక్రమాల్లో తాము తలమునకలై ఉన్నట్లు మంత్రులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండటంతో తాము కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించలేదన్నారు. తోచిన అంశాలను ఆధారంగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు తమ పై అసంబద్ధమైన వార్తలను వండివార్చేందుకు జర్నలిజం విలువలను గాలికొదిలేసిన మీడియా సంస్థలు చేసిన ప్రయత్నాలు బెడిసికొడతాయని వారు హెచ్చరించారు. మీడియా ముసుగులో ఏది పడితే అది రాస్తామంటే కుదరదని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా మారండి

టీఆర్పీ రేటింగ్‌ల కోసమో, ఇతరర ప్రయోజనాల కోసమే ఇలాంటి అవాస్తవ వార్తా కథనాలు వండివార్చుతున్నారని మంత్రులు నిప్పులు చెరిగారు. వృత్తి విలువలు పాటించని కొందరు జర్నలిస్టులు, మీడియా సంస్థల కారణంగా ప్రజలకు మీడియాపై చిన్నచూపు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే విధంగా వ్యవహరించకుండా నిజానిజాలను నిర్ధారణ చేసుకొని వార్తలను ప్రచురించాలని వారు సూచించారు. మీడియా సంస్థలు ప్రజలకు ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియాకున్న పేరుకు సార్థకతను చేకూర్చే దిశగా కృషి చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క హితవు పలికారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు