Kishan Reddy: జూబ్లీహిల్స్ బైపోల్ ను తాను రెఫరెండంగా తీసుకోబోనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ఎవరూ కోరుకోనిదని వివరించారు. సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరూ కోరుకోనటువంటిదని, ఈ ఎలక్షన్ కో 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ గెలవలేదన్నారు. గత ఎన్నికల్లో తాము 3వ స్థానానికి పరిమితమయ్యామన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినట్లు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే స్పష్టతకు ఇంకా రాలేదన్నారు. కానీ కొందరు సర్వేల పేరిట హడావుడి చేస్తున్నారని, దాన్ని తాము విశ్వసించడం లేదని తెలిపారు. సర్వేలను తాను కొట్టిపారేయడంలేదని, కానీ.. అందులో ఒక్కటి కూడా పేరున్న సంస్థలు నిర్వహించలేదని, అందుకే విశ్వసించడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో, మండలాల్లో జరిగే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ లో జరగకపోవడం దురదృష్టకరమని వివరించారు. హైటెక్ సిటీలో రోడ్లకు రంగులు వేసినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదని విమర్శించారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నగరానికి అత్యంత ప్రధానమని, ఆ సంస్థలు నిధులు లేక విలవిల్లాడుతున్నాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా..
జూబ్లీహిల్స్ వెనుకబాటుకు 10 ఏండ్లు పాలించిన బీఆర్ఎస్(BRS) తో పాటు కాంగ్రెస్(Congress) కూడా బాధ్యత వహించాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలపై కాంగ్రెస్ ఎక్కడా ప్రస్తావించడం లేదని చెప్పుకొచ్చారు. పాదయాత్ర చేస్తే డ్రైనేజీ ఓవర్ ఫ్లో అవుతున్న నీటిలోనే తిరగాల్సిన పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రెండేండ్లలో ఎన్నికల హామీలు ఎలా పరిష్కరిస్తున్నారో ప్రజలకు కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ స్వయంగా అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి హామీ ఇచ్చారని, మరి ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా యువతను మోసం చేస్తోందన్నారు. సకల సమస్యలకు పరిష్కారంగా ఫ్రీ బస్సును కాంగ్రెస్ చూపుతోందని కేంద్ర మంత్రి ఎద్దేవాచేశారు. మెట్రో ఫేస్ 2ను అడ్డుకుంటున్నానని తనపై సీఎం విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రమంత్రిగా పలు అభివృద్ధి పనులకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటే పరిష్కరించి భూమి కేటాయించాలని కేసీఆర్ కు స్వయంగా 40 లేఖలు రాశానని, అయినా స్పందించలేదన్నారు. ఇప్పుడు వారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయితీలకు గత, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని, కేంద్రం ఎన్ని కేటాయించందనేది బయటపెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఇక్కడే రిటైర్ అయితే వారి రాష్ట్రానికి వెళ్లకుండా తెలంగాణలోనే సెటిల్ అవుతున్నారని, కానీ తెలంగాణకు చెందిన ఐఏఎస్ లు మాత్రం రిటైర్ మెంట్ కు ముందే లగేజ్ ప్యాక్ చేసి రాష్ట్రానికి పంపిస్తున్నారంటే హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాబట్టేనని పేర్కొన్నారు. అలాంటి మహానగరంలో అభివృద్ధి చేపట్టకపోవడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!
రాహుల్‌కు ఇష్టంలేదు..
ఎకరాకు 7 కింటాళ్లు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, వారంలో ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు పత్తి కొంటామన్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకోవాలని సీఎం చెబుతున్నారని, ఓటు వేసేది సీఎం కాదని, అక్కడి ప్రజలని చురకలంటించారు. సీఎం వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. రేవంత్ సీఎంగా ఉండటం రాహుల్ కు ఇష్టంలేదని, ఆయన్ను తీసేయాలని చూస్తున్నా.. తప్పని పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారని కేటీఆర్ అంటున్నారని, దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో వందకు వంద శాతం భవిష్యత్ లో కలిసి పనిచేయబోమని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో 56 శాతం బీసీలుంటే 32 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
మంత్రి పదవి రెండేళ్ల క్రితమే..
బండి సంజయ్(Bandi Sanjay) రోడ్ షోను అడ్డుకోవడంపై కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. అనుమతి నిరాకరించిన అధికారులపై కేంద్రానికి, ఢిల్లీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఎంఐఎం కేవలం మద్దతు ఇచ్చిందని, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అసద్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), ఎంఐఎం(MIM) ఫ్యామిలీ పార్టీలని, వీరు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి రెండేళ్ల క్రితమే ఇవ్వొచ్చని, ఆలస్యం చేసినందుకు చార్మినార్ వద్ద సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారా? లేక వర్చువల్ గా ప్రారంభిస్తారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సమస్య పరిష్కారం కోసం కేంద్రం నుంచి సహకారం అందిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read: Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!
