Politics

Telangana :పెద్దపల్లి కమలంలో పెద్ద లొల్లి

– 25తో ముగుస్తున్న నామినేషన్ల ప్రక్రియ
– పెద్దపల్లి బీజేపీలో అయోమయం
– అభ్యర్థిని మారుస్తున్నట్టు జోరుగా ప్రచారం
– సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను నిలబెట్టే ఛాన్స్
– అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న గోమాసే
– ఇప్పటికే తలనొప్పిగా మారిన గ్రూపులు
– తాజా పరిణామాలతో గందరగోళం

తెలంగాణ బీజేపీ నేతలలో టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. ఓ పక్క నామినేషన్ల గడువు ముగుస్తుండగా ప్రకటించిన అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, బీజేపీలో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ, ఆ సీట్ల లొల్లిని ఇంకా కొలిక్కి తెచ్చుకోలేదు. తాజాగా పెద్దపల్లి టికెట్‌ అంశంలో రచ్చ కొనసాగుతోంది. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ పేరును అధిష్టానం ప్రకటించింది. దాంతో ప్రచార వ్యూహాలను, తన అనుచరగణాన్ని సమకూర్చుకుని ఇప్పటికే బోలెడంత ఖర్చు పెట్టేశారు ఆయన. కానీ, అనూహ్యంగా ఆయనకు బీఫామ్ అందలేదు. దీంతో అభ్యర్థిని మారుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎవరీ గోమాసే..?

ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు గోమాసే శ్రీనివాస్. రాజకీయాల్లో మక్కువతో 1982–92 మధ్య విద్యార్థి నాయకుడిగా, 1993నుంచి 2003వరకు ఎన్‌ఎస్‌యూఐలో పని చేశారు. 2004 నుంచే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూశారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి 2009లో పెద్దపల్లి స్థానం నుంచి పోటీ చేయగా, అప్పట్లో గడ్డం వివేక్‌ చేతిలో ఓడిపోయారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. తాజాగా పెద్దపల్లి టికెట్‌ తనకు రాదని గ్రహించే పార్టీని వీడారు. బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు ఆ అవకాశం వరించింది.

బీజేపీ యూటర్న్

బీజేపీ అధిష్టానం గోమాసే విషయంలో పునరాలోచనలో పడిందని సమాచారం. ఆయనకు బీఫామ్ ఇవ్వాలా వద్దా? అనే ఆలోచనలో ఉందట. ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ అయిన వెంకటేష్ నేతకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందా? అని సమాలోచనలు జరుపుతోందని సమాచారం. వాస్తవానికి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, తనకు మరోసారి టికెట్ వస్తుందని ఆశించగా కుదరలేదు. దాంతో తనకు టికెట్ ఇస్తానంటే పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బీజేపీ నేతలకు హింట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం పెద్దపల్లి టికెట్ విషయంలో పునరాలోచనలో పడిందని సమాచారం.

బీజేపీ అగ్రనేతలతో భేటీ..

కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న వెంకటేశ్ నేత, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తన కోరికను అమిత్ షాకు చెప్పారట. దీంతో పెద్దపల్లి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని కమలదళం భావిస్తోంది. ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి అభ్యర్థి విషయంలో ఇవాళో రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!