Aurobindo Pharma: అరబిందో ఫార్మా ఎండీ రామ్ ప్రసాద్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది. శేరిలింగంపల్లిలో సర్వే నెంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కబ్జా చేసిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాల్సిందిగా శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహెసిల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటున్నారని, స్థానికులు వారించినా వేగంగా నిర్మాణాలు చేపడుతున్నారని అదే ఏరియాకు చెందిన జీవన్ కుమార్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు స్థానికులు మౌఖిక ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకోలేదని జీవన్ పేర్కొన్నారు. తాను స్వయంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే చివరకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు వివరించారు. సీనియర్ అడ్వకేట్ రామారావు ఇమ్మానేని ఈ రిట్ పిటిషన్ పై వాదనలు వినిపించారు.
ప్రభుత్వ భూమిని అరబిందో ఫార్మా ఎండీ రామ్ ప్రసాద్ రెడ్డి, ఆయన అనుచరులు గుండా రాఘవేందర్ రావు, గుండా సర్వోత్తమ్ రావులు ఆక్రమిస్తున్నారని జీవన్ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ధర్మాసనం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జీవన్ దాఖలు చేసిన పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తెహసీల్దార్‌లను ఆదేశించింది.