Local Body Elections: స్థానిక ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ జీవో పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకటిరెండ్రోజుల్లో జీవో విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జీవో రాగానే ప్రభుత్వం ఎన్నిలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్లకు 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియను కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో మంగళవారం అన్ని జిల్లాల డీపీఓలు(DPO), ఆర్డీఓలు(RDO), ఎంపీడీలు(MPDO), మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, వార్డులు, మండలాల్లో జనాభా ప్రాతిపదికన చేసిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్లకు అందజేశారు. రిజర్వేషన్ల సమయంలో ఎదురైన అనుభవాలతో పాటు డేడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చేపట్టారా? అనేది కలెక్టర్లు ఆరా తీశారు.
ఎన్నికల నిర్వహణకు కావల్సిన సిబ్బంది, పోలింగ్ బూతులు, బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులపైనా అడిగి తెలుసుకున్నారు. కార్యదర్శులు పారదర్శకంగా చేశారా? లేదా? ఎంపీడీలు ఎలా పర్యవేక్షణ చేశారా అనే విషయాలను సైతం సేకరించారు. పూర్తి వివరాలను సేకరించిన కలెక్టర్లు.. ప్రభుత్వానికి సైతం వివరాలు చెప్పినట్లు సమాచారం. జడ్పీటీసీ(ZPTC), ఎంపీపీల రిజర్వేషన్లు కలెక్టర్లు ఫైనల్ చేయగా, ఎంపీటీసీ(MPTC), సర్పంచ్ రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ఎంపీటీసీ, సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్ల వివరాలను జడ్పీ సీఈఓలు, డీపీఓలు కలెక్టర్లకు అందజేశారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్ల పై బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
అధికారులతో టెలీ కాన్ఫరెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రి జిల్లా కేంద్రాలకు చేరాయి. వాటిపై అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన సైతం ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వస్తూ మరోవైపు రాష్ట్ర స్థాయి అధికారులను సైతం అలర్టు చేస్తుంది. అందులో భాగంగానే మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని, అందులో భాగంగానే బ్యాలెట్ పేర్లు, బాక్సులు సైతం ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు(Highcort) ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇటు పంచాయతీ అధికారులు, అటు ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా.. ఎన్నికలు నిర్వహించేలా అధికారులను, సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు.
Also Read: Gold Rate Today: ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?
జీవోపై ఎవరైనా కోర్టుకు..
రిజర్వేషన్లు కంప్లీట్ అయిన తర్వాత ఆల్ పార్టీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానున్నట్లు సమాచారం. అభ్యంతరాలు ఉంటే చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆతర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుందని, అలా కాకుండా వెనువెంటనే ఎన్నికలకు వెళ్లేలా సన్నద్ధమవుతున్నట్లు ప్రచారంజరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.
బీహార్ లో ‘ఓట్ చోరీ’
బీహార్ లో ‘ఓట్ చోరీ’ జరిగిందనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుంది. అలాకాకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ప్లాన్ తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుంది. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పక్రియను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం 2001 జనాభా లెక్కలు 2023లో నిర్వహించిన కులగణన లెక్కలతో మ్యాచ్ చేస్తున్నారు. ఓటర్ల వివరాలు పక్కగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తుందా? అనేది ఆశావాహులతో పాటు ప్రజల్లోని ఆసక్తి నెలకొంది.
Also Read: Fake Passbook: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్