Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వేడుకలను ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా ప్లాన్ చేశారు. జూన్ 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి.
ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతారు. అనంతరం, పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ ఉంటుంది. ఈ ఫొటో సెషన్‌తో ఉదయం పూట కార్యక్రమాలు ముగుస్తాయి.
జూన్ 2వ తేదీన సాయంత్రంపూట వేడుకలు ట్యాంక్ బండ్ పై ప్రారంభం అవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటై ఉంటాయి. సాయంత్రం 6.30 గంటలకు సీఎం ట్యాంక్ బండ్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు సంబంధించి కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాలపాటు పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై అటు నుంచి ఇటు చివర వరకు భారీగా ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఇందులో సుమారు 5 వేల మంది పాల్గొంటారు. ఈ సమయంలో జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో బాణాసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.