– కేంద్రమంత్రులకు టీ బీజేపీ ఘనస్వాగతం
– బేగంపేట్ నుంచి నాంపల్లి వరకు భారీ ర్యాలీ
– కొత్త ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సన్మానం
– ఇది అందరి విజయమన్న కిషన్ రెడ్డి
Salute Telangana: కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లకు తెలంగాణ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగత ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగా, మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి బేగంపేట్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవలి గెలిచిన ఎమ్మెల్యేలూ జతకలిశారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన ర్యాలీ కార్యకర్తలు,నేతల నినాదాలతో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
బేగంపేట్ నుంచి మొదలైన ర్యాలీ ప్యారడైజ్, రాణిగంజ్, కవాడీగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసుకు చేరుకుంది. అనంతరం పార్టీ కార్యాలయంలో ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులతో బాటు ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నేతలు ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత వీరంతా కలిసి వెళ్లి చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
రుణం తీర్చుకుంటాం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థులపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన తెలంగాణకు తమ పార్టీ రుణపడి ఉంటుందని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని వాగ్దానం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా 36 శాతం ఓట్లు అందించారనీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతంగా ఉన్న ఓట్లకు ఇది మరింత ఎక్కువని గుర్తుచేశారు. బీజేపీ విజయానికి సహకరించిన ప్రతి కార్యకర్త, నాయకుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.