Gulf And Overseas Workers Welfare Board Soon CM Revanth Reddy
Politics

Telangana Cabinet: నేడే రాష్ట్ర కేబినెట్ భేటీ..! వీటిపైనే చర్చ

– ఏపీతో పెండింగ్ ఆస్తుల పంపకంపై దృష్టి
– ధాన్యం కొనుగోళ్లు, రుణమాఫీపై కీలక చర్చ
– చర్చకు రానున్న విద్యా ప్రణాళిక, ఖరీఫ్ అంశాలు
– రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ యాక్షన్ ప్లాన్
– ధరణి, మేడిగడ్డపై భవిష్యత్ కార్యాచరణ
– నేటి భేటీలో చర్చకు రానున్న అంశాలివే..

CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ నేడు సమావేశం కానుంది. నేటి మంత్రిమండలి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు విభాగాల అధిపతులతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర పునర్విభజనతో సహా పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌తో అపరిష్కృతంగా ఉన్న అంశాల మీద మంత్రిమండలి నేడు దృష్టి సారించనుంది. ముఖ్యంగా పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9,10లోని వందకు పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, ఏపీ నుంచి రావాల్సిన బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో ఆర్థిక శాఖ తయారుచేసిన నివేదికపై చర్చించి, ఏపీ ప్రభుత్వంతో చర్చించి సదరు అంశాలను సానుకూలంగా పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ 2 న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఆ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల మీద సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నేటి సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. 42 లక్షలమంది రైతుల రూ. 32 వేల కోట్ల బకాయిలను మాఫీ చేసేందుకు రుణమాఫీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల సమీకరణకు సంబంధించిన విధివిధానాలను నేటి కేబినెట్ చర్చించనుంది. మరోవైపు ఖజానాకు రావాల్సిన బకాయిలు, ప్రతిపాదనల్లో ఉన్న నూతన ఆదాయ మార్గాల మీద కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఆదాయ పెంపు మార్గాల అన్వేషణలో భాగంగానే గత గురువారం సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, తదితర శాఖలతో సమావేశం నిర్వహించి, బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ల తీరును కేబినెట్ సమీక్షించనుంది. వీలున్నంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు ముగించాలని, అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం, వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటల ప్రణాళిక, రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూడటం, సాగునీటి ప్రణాళిక వంటి అంశాల మీదా మంత్రివర్గం దృష్టి సారించనుంది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలపై చర్చించి మరమ్మతులపై తదుపరి కార్యాచరణపైనా మంత్రిమండలి చర్చించనున్నారు. ధరణి కారణంగా దగాపడిన వారికి న్యాయం చేసేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాల మీదా చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మరో 20 రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యునిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపైనా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, వానాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని పట్టణ, నగర ప్రాంతాల్లో చేపట్టాల్సిన రోడ్డు, నాలాల మరమ్మతులు, ముంపు ప్రాంతాలను గుర్తించటం వంటి అంశాల మీద చర్చ సాగే అవకాశముంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?