Teenmar Mallanna shows mejority graduate mlc 2nd round complete:
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కౌంటింగ్ లో ఇప్పటివరకూ రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 96 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్ మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పై 14 వేల 672 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్ లో మల్లన్నకు 7 వేల 670 ఓట్లు రాగా ప్రత్యర్థిపై 7 వేల రెండు అధిక్యత కనబరిచారు.
తొలి రౌండ్ మల్లన్నదే
మొదటి రౌండ్ ముగిసే సరికి మల్లన్నకు 36 వేల 210 ఓట్లు వచ్చాయి. రాకేశ్ రెడ్డికి 28 వేల 540 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11 వేల 395 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు 9 వేల 109 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ కు వచ్చేసరికి మల్లన్నకు 34 వేల 575 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 27 వేల 573 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 12 వేల 841 ఓట్లు, అశోక్ కు 11 వేల 018 ఓట్లు వచ్చాయి. గురువారం పొద్దుపోయిన తర్వాత తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
సాయంత్రానికి తుది రౌండ్ ఫలితం
ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వేయి చొప్పున ఒక రౌండ్‌లో మొత్తం 96 వేల ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది. గురువారం సాయంత్రం వరకూ తుది ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి అభ్యర్థుల గెలుపు కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతానికి పైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఫలితం… తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో తేలకపోవచ్చన్నది ప్రధాన పార్టీల అభిప్రాయం. అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి గెలుపు కోటాను చేరిన వారిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు.