ఏపీలో గత రెండు రోజులుగా పింఛన్ల చుట్టు రాజకీయాలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో వలంటీర్లు సేవలకు దూరంగా ఉండటంతో వృద్ధులు పింఛన్ల కోసం తంటాలు పడుతున్నారు. అసలే వేసవి ఎండలు ఇప్పుడే దంచికొడుతున్నాయి. ఈ ఎండల్లో సచివాలయాల వద్దకు వెళ్లి అక్కడ పింఛన్ల కోసం క్యూ కట్టడం, ఖాతాలో ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కాకపోవడం వంటి అంశాలతో ఈ రోజు పింఛన్ లబ్దిదారులు ఇక్కట్లపాలయ్యారు. కొందరైతే ఉదయమే వచ్చి సాయంత్రం వరకు పింఛన్ల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఖాతాలో డబ్బులు జమ కాలేవని కొందరిని సిబ్బంది వెనక్కి పంపింది. రేపు వచ్చి పింఛన్ తీసుకోవాల్సిందిగా సూచించింది.
ఈ తరుణంలోనే వృద్ధులకు ఇంటికి పింఛన్ తెచ్చి ఇచ్చేలా చూడాలని టీడీపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నిన్ననే చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేశారు. సచివాలయ సిబ్బంది 1.26 లక్షల మంది ఉన్నారని, వారితో పింఛన్లను లబ్దిదారుల ఇంటికి పంపించాలని సూచించారు.
పింఛన్ల సమస్య ముందుకు రాగానే రాజకీయాల కోసం అవ్వాతాతలను పణంగా పెడుతున్నారా? అంటూ విమర్శలు వచ్చాయి. వృద్ధుల ఒక వైపు అవస్థలు పడుతుంటే.. దీని గురించి పక్కన పెట్టి వైసీపీ కొత్తరాగం ఎత్తుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగాలను నియమించలేదని, నిరుద్యోగిత పెరిగిపోయిందని టీడీపీ విమర్శించింది కదా… మరి వారే చెబుతున్న 1.26 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎలా వచ్చారని ప్రశ్నించింది. వీరంతా వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించినవారే కదా అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. వారంతా డిగ్రీ పట్టాలతో బయటికి వస్తే.. వారికి తాము ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.