– ములుగు ఆర్వీఎం మెడిసిన్ కాలేజీలో అధ్యాపకుల ఓవరాక్షన్
– నిరసనకు దిగిన కేరళ విద్యార్థినులు
– స్టూడెంట్స్ బాధను ప్రసారం చేసిన బిగ్ టీవీ
– స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్
– తెలంగాణ సీఎంవోకు ఫోన్
– వెంటనే కాలేజీకి చేరుకున్న ఉన్నతాధికారులు
– యాజమాన్యం, విద్యార్థులతో చర్చలు
Student Protest: పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అభ్యంతరకర మాటలతో ఇబ్బంది పెట్టారు. కోట్ల రూపాయల ఫీజులు తీసుకుని సరైన వసతులు కూడా కాలేజీలో కల్పించలేదు. దీంతో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. రెండు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. వీరంతా కేరళకు చెందిన విద్యార్థినులు. బిగ్ టీవీ న్యూస్ చొరవ తీసుకుని వారి బాధను ప్రసారం చేసింది. ఫలితంగా వార్త కేరళ సీఎం వరకు చేరింది. కేరళ నుంచి తెలంగాణ సీఎంవోకు ఫోన్ రావడంతో గంటల వ్యవధిలోనే ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు ఆర్వీఎం మెడిసిన్ కాలేజీలో జరిగింది. ములుగు ఆర్వీఎం మెడిసిన్ కళాశాల విద్యార్థినులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధ్యాపక బృందం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయల్లో ఫీజులు వసూలు చేసినా, కనీసం ఆహారం కూడా బాగుండటం లేదని పేర్కొన్నారు. తమ పేరెంట్స్‌తో మాట్లాడతామని ఫోన్ ఇవ్వాలని కోరితే గర్భవతులు అవుతారా? అని అవహేళన చేశారని బాధపడ్డారు. అందుకే, తామంతా ఆందోళనకు దిగినట్టు వివరించారు. కళాశాల యాజమాన్యంపై తిరుగుబాటుకు దిగడంతో అధ్యాపకులు బెదిరించినట్టూ చెప్పారు. నిరసన చేపడితే మార్కులు తక్కువ వేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ విషయం బిగ్ టీవీ దృష్టికి వచ్చింది. వెంటనే, ఈ వ్యవహారంపై వార్త ప్రసారం చేసి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే, ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద ఆర్వీఎం కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. యాజమాన్యం, విద్యార్థులతో చర్చలు జరిపింది. 14 డిమాండ్లు చెప్పగా, తలొగ్గిన యాజమాన్యం 11 డిమాండ్లకు ఆమోదం తెలిపింది. కేరళకు చెందిన సుమారు 500 మంది నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారని, అక్కడి కాలేజీలో అవస్థలు పడుతున్నారని తెలియగానే కేరళ సీఎం పినరయి విజయన్ వెంటనే స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సీఎంవో అధికారులకు ఫోన్ చేసి ఆర్వీఎం కాలేజీలో మెడిసిన్ విద్యార్థినుల నిరసనలపై ఆరా తీశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని సూచించారు. దీంతో ఉన్నతాధికారులు ఆర్వీఎం కాలేజీ చేరుకుని విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు.