– హైదరాబాద్‌లో రోడ్డెక్కిన విద్యార్థులు
– నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్
– విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
– నారాయణగూడ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దాకా మార్చ్
– మోదీ సమాధానం చెప్పాలని బల్మూరి డిమాండ్
– రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్‌వీ నేతలు
NEET Exam: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కదం తొక్కారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైదరాబాద్‌లోని నారాయణగూడ నుంచి ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ చేపట్టారు. ఎన్ఎస్‌యూఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, విద్యార్థి జనసమితి, ఆప్ విద్యార్థి విభాగం, పీవైఎల్ సహా పలు విద్యార్థి, యువజన సంఘాలు కదం తొక్కాయి. కేంద్ర ప్రభుత్వానికి, నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లోనూ నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు జరిగాయి.
దోషులను శిక్షించాలి
నీట్ పరీక్ష జరగడానికి ముందే ప్రశ్నాపత్రం లీకేజ్ అయినట్టు వార్తలు వచ్చాయని, చాలా చోట్ల అవకతవకలూ జరిగాయని విద్యార్థులు పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని అన్నారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులు వచ్చిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిందని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పాల్గొన్నారు.
కేంద్రమంత్రులు సమాధానం చెప్పాలి
బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ, నీట్ అంశంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంపై సమాధానం చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. నీట్ పరీక్షలో అవకతవకల వల్ల 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఎన్టీఏ చైర్‌పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని స్పష్టం చేశారు. గతంలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ తాజాగా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని, భవిష్యత్ కార్యచరణపై విద్యార్థి సంగాల నాయకులం మరోసారి సమావేశమై చర్చిస్తామని పేర్కొన్నారు.
రాజ్ భవన్ ముట్టడికి బీఆర్ఎస్‌వీ యత్నం
నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్‌వీ సైతం ఆందోళనకు దిగింది. రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రాజ్ భవన్ ముట్టడికి యత్నించగా గెల్లు శ్రీనివాస్ సహా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు తరలించారు.