BJP Govt: టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పై నిప్పులు చెరిగారు. కొత్తగా కేంద్రంలో కొలువుదీరిన మంత్రులుగా ప్రమాణం చేసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని అన్నారు. కానీ, ఈ సారి సాకులు చెప్పడానికి అవకాశం లేదని హెచ్చరించారు.
కేంద్రం గతంలో రద్దు చేసిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు ఈ సారి తప్పకుండా కార్యరూపం దాల్చితీరాలని అన్నారు. మూసి ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ సారి వీటికి కచ్చితంగా బడ్జెట్‌లో పెట్టించి తీరాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొట్లాడిన విద్యార్థిని ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పొట్టనపెట్టుకున్నాయని ఆరోపించారు.
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నష్టపోతున్నా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకున్నా, సహకారం అందకున్నా ఏనాడూ ఎండగట్టలేదని సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఏనాడూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టలేదని అన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండబోవని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, చెవిలో పూలు పెట్టే పరిస్థితులు ఇక నుండి సాగవని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి రోజూ బీజేపీ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.