– పార్టీ మార్పుపై సబిత స్పందన
– బీఆర్ఎస్‌లోనే ఉంటానని క్లారిటీ
– ఊహాగానాలను పట్టించుకోవద్దని సలహా
Congress: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని, వాటిని ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాంటి ఆధారంలేని వార్తలను ప్రసారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనకు పార్టీలో సముచితమైన స్థానం కల్పించారని, కనుక పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ తనకు లేవని క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనూ బీఆర్ఎస్ పార్టీలోనే పని చేస్తానని ప్రకటించారు. దీంతో.. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. మంత్రి పదవితో పాటు కుమారుడు కార్తీక్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తారని, ఆషాడం రాకముందే వీరు పార్టీ మారటానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలకు.. తాfజాగా సబిత ఇచ్చిన క్లారిటీతో చెక్ పడినట్లయింది.
భర్త ఇంద్రారెడ్డి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలవటమే గాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, చేవెళ్ల చెల్లెమ్మగా ఆమె గుర్తింపు పొందారు. మనదేశంలో తొలిసారి ఒక మహిళ రాష్ట్రానికి హోం మంత్రి కావటం ఆమెతోనే మొదలైంది.