CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు గడుస్తున్నది. కానీ, ఇప్పటికీ రాష్ట్ర గీతం లేదు. తెలంగాణ ఉద్యమ కారుల గొంతులో మెదిలిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఈ నిర్ణయం ప్రకటించనున్నారు. అలాగే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులపై బీఆర్ఎస్ మండిపడుతున్నది. ఇది కేవలం బీఆర్ఎస్ కీర్తిని తగ్గించే ప్రయత్నమని, రాష్ట్ర వారసత్వ సంపదను తుంగలో తొక్కడమని ఆరోపిస్తున్నది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని తెరమీదికి తెచ్చింది. రాష్ట్ర గీతాన్ని ఆంధ్రావారితో స్వరకల్పన చేయడమేమిటీ? ఆంధ్రోళ్ల పెత్తనం ఏమిటీ అని ప్రశ్నించడం మొదలు పెట్టింది. కళకు సరిహద్దులు లేవనే మాట విమర్శకుల నుంచి వినిపిస్తున్నది. ఇదే కోణంలో అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, ఈ ఉద్యమ వ్యతిరేకి అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు.
కాగా, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్ర చిహ్నం తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, పోరాటాల గడ్డను ప్రతిబింబించేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాచరిక వ్యవస్థను సూచించే గుర్తులు చిహ్నంలో అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవే విషయాలను కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఉద్యమ వ్యతిరేకి కాదని ఆధారాలతో సహా చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పాపులర్ అయినంతగా రేవంత్ రెడ్డి కాలేదు. వాస్తవానికి అప్పుడు ఆయన ఉన్న పార్టీ లేదా.. ఆయన రాజకీయ హోదాలు వగైరా ఈ అంశాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందుకు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలనే ఇప్పుడు కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌పై ఎటాక్ చేస్తున్నది. ఈ క్రమంలోనే టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామా రామ్మోహన్ రెడ్డి ఉద్యమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఫొటోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రేవంత్ రెడ్డి ఆందోళన చేస్తుంటే పోలీసులు ఆయనను ఎత్తుకెళ్లుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతున్నది.