Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలలోని ప్రతి సభ్యురాలికి ఏడాదికి రెండు క్వాలిటీ చీరలను అందజేస్తామని ప్రకటించారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట (Narayanapeta) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అప్పక్ పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ప్రతి జిల్లాలోని ప్రభుత్వ స్థలంలో ఒక పెట్రోల్ బంక్ ప్రారంభించి.. ఆ తర్వాత నియోజకవర్గానికి ఒక్కటి ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
‘రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సమాఖ్య సభ్యులు ఉన్నారు. సొంత బిడ్డలకు ఎలాంటి చీరలు అయితే ఇస్తామో.. రూ.1000 కోట్లతో ఏడాదికి రెండు క్వాలిటీ చీరలను ప్రతి సమాఖ్య సభ్యురాలికి ఇస్తాం. గతంలో బీఆర్ ఎస్ (Brs) టైమ్ లో క్వాలిటీ లేని చీరలు ఇచ్చారు. కానీ మేం అలాంటి చీరలు ఇవ్వం. మన ఇంట్లో ఆడబిడ్డలకు ఎలాంటి క్వాలిటీ చీరలు ఇస్తామో.. ప్రతి సమాఖ్య సభ్యురాలికి కూడా అలాంటి చీరలే ఇస్తాం. తెలంగాణలో (Telangana) కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు మిమ్మల్ని ఓనర్లను చేశాం. త్వరలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టులను కూడా మహిళలే నడిపబోతున్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే శిల్పారామంలో మీ వస్తువులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేశాం. తొందరలోనే మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.