Media: ఆంధ్రాలో ఈమధ్యే ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కార్ పోయి కూటమి ప్రభుత్వ పాలన వచ్చింది. అయితే, వచ్చీ రాగానే కొన్ని న్యూస్ ఛానళ్లపై ఆంక్షలు విధించడం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానళ్లలో ‘‘BARC India’’ తాజా గణాంకాల ప్రకారం 60 శాతం మించి వీక్షకాదరణ ఉన్న నాలుగు ప్రధాన న్యూస్ చానళ్లపై ఉక్కుపాదం మోపారు. అటు మీడియా సర్కిళ్లలో, ఇటు సోషల్ మీడియాలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపడం న్యాయమా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, మరోపక్క మీడియా స్వేచ్ఛను ఆడ్డుకునేలా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ టీవీ9 సహా నాలుగు ప్రధాన న్యూస్ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం ఎలాంటి ప్రజాస్వామ్యం? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు.
కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అదే కోట్ల మంది జనం ఆదరించే న్యూస్ ఛానళ్ల ఉనికే లేకుండా చేయాలని కుట్ర చేయడం ప్రజావ్యతిరేక చర్య అనిపించుకోదా? నాలుగు ప్రధాన న్యూస్ ఛానళ్ల ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో కేబుల్ ఆపరేటర్లు అడ్డుకోవడంపై ఢిల్లీ హైకోర్టు కన్నెర్ర చేసినా కిమ్మనకపోవడం కోర్టు ధిక్కరణ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలానే, గతంలో న్యూస్ ఛానళ్లకు సంకెళ్లు వేసిన కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు చివరికి ఏమయ్యాయో తెలిసి కూడా పరిణతి చెందిన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు తన పాలనలో మీడియాను నియంత్రించాలనుకోవడం ఏవిధంగా సబబు అంటూ జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు.