Ranga Reddy District: కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పదవుల పంపిణీలో సామాజిక న్యాయం కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, ఆ సమీకరణాలు కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయనే ఆందోళన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్ష పీఠం విషయంలో జరుగుతున్న జాప్యం, ఒకే వర్గానికి పెద్దపీట వేయాలనే యోచనపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీలకు అర్హత లేదా?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదటి నుంచి నేటి వరకు కేవలం బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకే డీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బీసీలకు 28 ఏళ్లు, ఓసీలకు 8 ఏళ్లు, మైనార్టీలకు కూడా అవకాశం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న ఎస్సీ సామాజిక వర్గానికి అధ్యక్షుడి పీఠం ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఓట్లు వేసేందుకు మాత్రమే సామాజిక వర్గం పనికొస్తుందా? కానీ పార్టీ పదవుల్లో క్రీయశీలకంగా ఉండనివ్వరా?’ అనే చర్చ సాగుతోంది.
Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!
వారికే మళ్లీ పదవులా?
పార్టీలో పదవులు వచ్చిన వ్యక్తులకే తిరిగి పార్టీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన అధిష్టానం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా, నామినేటెడ్ పదవులు పొందిన వారే తిరిగి జిల్లా అధ్యక్ష పీఠాన్ని ఆశించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్థిక, అంగ బలం లేని, కానీ పార్టీకి క్రమశిక్షణతో పనిచేసే నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డిలో ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికే పెద్దపీట వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీసీసీ ప్రకటన ఆలస్యం వెనుక?
డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై మరో వర్గం ‘లోకల్-నాన్ లోకల్’ పేరుతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడి పేరు ప్రకటన ఆలస్యమైందని తెలుస్తోంది. జాబితాలో ఆ పేరు లేకుండా చేయడంలో ఓ వర్గం సక్సెస్ అయిందనే చర్చ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో పలువురు నేతలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రాంరెడ్డి (ఆర్అండ్బీ కార్పొరేషన్ ఛైర్మన్), పారిజాత నర్సింహ్మారెడ్డి (బడంగ్‌పేట్ మాజీ మేయర్), బీసీ వర్గం నుంచి ముద్దగౌని వేణుగౌడ్, ఎస్సీ నుంచి భీం భరత్, రాచమల్లు సిద్ధేశ్వర్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరకు ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తుందోనని జిల్లా నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!
