Singareni: బొగ్గు గనుల వేలంపాటను తీవ్రంగా వ్యతిరేకించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం.. అవసరమైతే సేవ్ సింగరేణి ఉద్యమం మరోసారి చేపడతామని హెచ్చరించారు. సింగరేణికి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని, ప్రైవేటు సంస్థల కన్నా.. సింగరేణి ఎక్కువ లాభాలను ఇస్తుందని వివరించారు. ప్రైవేటీకరణ జరిగినప్పుడల్లా స్థానికంగా ఉద్యోగాలు పోతాయని చెప్పారు. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు.
1973లో ఇందిరా గాంధీ సింగరేణి సంస్థను జాతీయీకరణ చేసిందని, పార్లమెంటు చట్టం ద్వారా సంస్థలను జాతీయీకరణ చేసిందని ప్రొఫెసర్ కోదండరాం వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో సేవ్ సింగరేణి ఉద్యమం చేపట్టామని, అవసరమైతే ఇప్పుడు కూడా సేవ్ సింగరేణి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలకు వేలంపాట నుంచి మినహాయింపు ఇవ్వాలని, గనులను వాటికి కేటాయించాలని వివరించారు. సింగరేణి కన్నా ప్రైవేటు యాజమాన్యం ఎక్కువ ఆదాయం ఇవ్వగలుగుతుందా? అని తాను కేంద్ర ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నట్టు పేర్కొన్నారు. అధికా ఆధాయంలో ఉన్న సంస్థను వేలంపాట వైపుగా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ సింగరేణి విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు.