Ponnam Prabhakar visited abids Alia model high school:
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ. 11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్ళలో విద్య నిర్వీర్యం అయ్యిందని చెప్పారు. అబిడ్స్ అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు.
ఆలియా పాఠశాలకు గొప్ప చరిత్ర
అలియా పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని 1872లో స్థాపించారని తెలిపారు. విద్యార్థులు ఆసక్తితో చదవడంతో పాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు పొన్నం ప్రభాకర్. పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు విద్యుత్ ,డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని కల్పించామన్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా విద్య ఉండబోతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిద్దాం
సీఎం, నేను, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలలనుండి వచ్చినవాళ్లమే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలని చులకనగా చూడొద్దు. అనుభవజ్ణులైన ఉపాధ్యాయులున్నారిక్కడ. విద్యాపరంగా అనేక సదుపాయాలు కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్ధులను మంత్రి పొన్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈవో రోహిణి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.