Gulf And Overseas Workers Welfare Board Soon CM Revanth Reddy
Politics

Emblem: చిహ్నం.. చిటపటలు!.. అసెంబ్లీలో చర్చిద్దామన్న సీఎం

– రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా
– క్రెడిట్ కొట్టేసే పనిలో బీఆర్ఎస్
– సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
– హాజరైన పలు పార్టీల నాయకులు, మేధావులు
– రాష్ట్ర గీతం, చిహ్నంపై చర్చ
– ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి ఆమోదముద్ర
– జూన్ 2న జాతికి అంకితం చేస్తామన్న రేవంత్ రెడ్డి
– కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలపై అపోహలు వద్దు
– తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం
– సమావేశం అనంతరం చుక్కా రామయ్య ఇంటికి సీఎం

Telangana: రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధమవుతోంది తెలంగాణ. జూన్ 2న అంబరాన్నంటేలా సంబురాలు జరగనున్నాయి. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర గీతం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్టు ప్రచారం సాగింది. అయితే, ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మరిన్ని చర్చలకు నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో తమ వల్లే వెనక్కి తగ్గిందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు మొదలుపెట్టారు.

అధికారిక చిహ్నం ఆవిష్కరణ ఆలస్యం

షెడ్యూల్ ప్రకారం కొత్త అధికారిక చిహ్నాన్ని జూన్ 2న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. రాచరికానికి ప్రతీకగా ఉందంటూ చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించి వాటి స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మతో కొత్త చిహ్నం తయారవుతోందని ప్రచారం సాగింది. పలు వర్గాల నుంచి అనేక సూచనలు వెల్లువెత్తాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారిక చిహ్నం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి జూన్ 2న ఆవిష్కరణను వాయిదా వేసింది. రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నట్టు స్పష్టం చేసింది. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

సీఎం కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర గీతం, అవతరణ వేడుకులకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దీనికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన వారికి కొత్త గీతాన్ని సింగర్స్‌తో వినిపించారు. వారి సలహాలు తీసుకున్నారు. అనంతరం ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని కోరారు.

రాష్ట్ర గీతంపై క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు సీఎం. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వెర్షన్లలో రూపొందించారు. 2.30 నిమిషాల నిడివితో ఒకటి, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్ తయారు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ హడావుడి

ఓవైపు చర్చలు జరుగుతుండగానే, ఇంకోవైపు బీఆర్ఎస్ ధర్నాలకు దిగింది. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించింది. అయితే, ప్రభుత్వం ఆవిష్కరణను వాయిదా వేసిందని వార్తలు రావడంతో, తమ పోరాటం వల్లే వెనక్కి తగ్గిందని పలువురు గులాబీ నేతలు మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. ఇంకా చర్చలే జరుగుతున్నాయని, ఆలోపే ఇంత హడావుడి ఎందుకంటూ కాంగ్రెస్ సైడ్ నుంచి కౌంటర్ మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ చిహ్నాల ఫొటోలు వైరల్‌

కొత్త చిహ్నం ఎలా ఉంటుందనే ఉత్కంఠ తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. ఎప్పుడెప్పుడు రిలీజ్‌ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో నెట్టింట మూడు డిజైన్లతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తొలి చిహ్నం మధ్యలో పూర్ణకుంభం, దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పై భాగంలో మూడు సింహాలు, కింద చార్మినార్ ముద్ర ఉంది. అలాగే రెండో చిహ్నం పైభాగంలో 3 సింహాల రాజముద్ర, మధ్యలో రాష్ట్ర మ్యాప్, కింద హుస్సేన్ సాగర్‌లో ఉండే బుద్ధుని స్టాచ్యూ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, తెలంగాణ కొత్త చిహ్నం ఇదేనంటూ మరో లోగో బయటికొచ్చింది. అందులో రాష్ట్రాన్ని సాధించిన అమరవీరులకు గుర్తుగా ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఉంచారు. దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పైన మూడు సింహాల రాజముద్ర ఉన్నాయి. చుట్టూ నాలుగు భాషల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?