తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Notice to Pochampally Srinivas: ఫార్మ్ హౌస్ కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్ఎస్ వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బీఎన్ఎస్ సబ్ సెక్షన్ (2) ఆఫ్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు జారీ చేశారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.మొయినాబాద్ ప్రాంతంలోని తోల్ కట్ట గ్రామంలో ఉన్న ఓ ఫార్మ్ హౌస్ లో కోళ్ల పందాలు, క్యాసినో జూదం నడుస్తున్నట్టు అందిన సమాచారం మేరకు గతనెలలో రాజేంద్రనగర్ ఎస్వోటీ సిబ్బంది మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కోళ్ల పందాలు, క్యాసినో ఆడుతున్న 64మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పందెం కోళ్ల కాళ్లకు కట్టే 46 కత్తులు, 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కోటి రూపాయలకు పైగా విలువ చేసే క్యాసినో కాయిన్లు, కార్డులు, పేక ముక్కలను సీజ్ చేశారు. 55 లగ్జరీ కార్లు, 64 స్మార్ట్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, జూదం ఆడుతూ పట్టుబడ్డ వారి నుంచి 30లక్షల 59వేల 620 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ఈ ఫార్మ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదని వెల్లడైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భూపతిరాజు శివకుమార్ వర్మ దీంట్లో జూద కార్యకలాపాలు నడిపిస్తున్నట్టుగా తేలటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఎమ్మెల్సీ ఫార్మ్ హౌస్ కాబట్టి పోలీసుల దాడులు ఉండవని చెప్పి సదరు శివకుమార్ వర్మ ఆంధ్ర ప్రాంతం నుంచి బడా వ్యాపారులు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను కార్లలో ఇక్కడికి పిలిపించుకుని కొన్ని నెలలుగా కోళ్ల పందాలు జరుపుతుండటంతోపాటు క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా వెల్లడైంది.
తెలిసే జరిగాయా…?
ఇక, ఫార్మ్ హౌస్ లో కోళ్ల పందాల నిర్వహణ, క్యాసినో దందా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తెలిసే జరిగాయన్న అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. ఫార్మ్ హౌస్ లో ఇంత పెద్ద మొత్తంలో జూదం జరుగుతోందంటే యజమానికి తెలిసే ఈ వ్యవహారం నడిచి ఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే మొయినాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గత నెలలో బీఎన్ఎస్ సెక్షన్ 35 (1) ప్రకారం నోటీసులు జారీ చేశారు. కోళ్ల పందాలను నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3,4, క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు అందులో పేర్కొన్నారు. తగు డాక్యుమెంట్లు ఇతర ఆధారాలతో వచ్చి నోటీసు అందుకున్న నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్సీ వివరణ…
దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన న్యాయవాదుల ద్వారా పోలీసులక వివరణ పంపించారు. ఫార్మ్ హౌస్ తనదే అయినా దానికి సంబంధించిన అన్నివ్యవహారాలను తన మేనల్లుడు జ్ఞాన్ దేవ్ రెడ్డికి అప్పజెప్పినట్టు వివరణలో పేర్కొన్నారు. పోలీసుల దాడి తరువాత జ్ఞాన్ దేవ్ రెడ్డిని అడిగితే ఫార్మ్ హౌస్ ను వర్రా రమేశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకిచ్చినట్టుగా తెలిసిందన్నారు. రమేశ్ కుమార్ రెడ్డి ఫార్మ్ హౌస్ ను మరో వ్యక్తికి లీజుకిచ్చినట్టుగా తెలియవచ్చిందన్నారు.
రెండో నోటీసు…
అయితే, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన వివరణ సమగ్రంగా లేకపోవటంతో మొయినాబాద్ పోలీసులు తాజాగా గురువారం ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్ లోని ఎమ్మెల్సీ ఇంటికి ఎస్సై ముజఫిర్ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో లేరని ఆయన వద్ద పని చేస్తున్న సిబ్బంది చెప్పారు. దాంతో నోటీసును ఎమ్మెల్సీ వద్ద పని చేస్తున్న ఉద్యోగికి అందచేసిన ఎస్సై ముజఫిర్ ఆ విషయాన్ని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు వ్యక్తిగతంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. దీనిపై ఎస్సై ముజఫిర్ తో మాట్లాడగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మొదటి నోటీసుకు ఇచ్చిన వివరణలో పలు సందేహాలు ఉన్నట్టు చెప్పారు. వాటిని నివృత్తి చేసుకోవటానికే రెండోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.