– హైదరాబాద్‌లో నీట్ మంటలు
– ఎంపీ డీకే అరుణ ఇంటి దగ్గర ఉద్రిక్తత
– ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన
– నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్
– పోలీసుల ఎంట్రీ.. నిరసనకారుల వాగ్వాదం
– అరెస్టులతో కాసేపు రణరంగం
NEET: నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. ఓవైపు విద్యార్థులు రోడ్డెక్కగా, ఇంకోవైపు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది ఈ అంశం. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుండగా, విద్యార్థి నాయకులు బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని విద్యార్థి నాయకులు ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిని ముట్టడించారు ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి, పరీక్షను మళ్లీ నిర్వహించాలని మహబూబ్‌నగర్‌లోని డీకే అరుణ ఇంటిని ముట్టడించారు విద్యార్థి నాయకులు.
అలాగే ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్, యూజీ, పీజీ నిర్వహణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉండడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పలువుర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో, పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.