– జూన్ 30లోపు విచారణ పూర్తి కాదు
– ఎన్నికల కోడ్‌తో కొంత ఆలస్యం
– విచారణ కోసం అధికారులకు నోటీసులు
– బీఆర్కే భవన్‌లో పలువురు అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
Pinaki Chandraghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది వరకే విచారణ ప్రారంభించిన పిసి ఘోష్ కమిషన్ ఇప్పుడు వేగం పెంచింది. మరోసారి జస్టిస్ ఘోష్ టీమ్ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను విజిట్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులకు నోటీసులు పంపింది. తాజాగా సోమవారం ఈఎన్సీ, ఈఈలతో బీఆర్కే భవన్‌లో పీసీ ఘోష్ భేటీ అయ్యారు. ఇరిగేషన్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు సహా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను విచారణకు రావాల్సిందిగా పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. మురళీ ధర్ రావుతోపాటు పలువురు ఇరిగేషన్ అధికారులతో సోమవారం బీఆర్కే భవన్‌లో కమిషన్ భేటీ అయింది. ఈఈలను కూడా విచారించినట్టు తెలిసింది.
పి చంద్రఘోష్ సోమవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ ప్రారంభమైందని వివరించారు. ఇప్పటికే తాము ప్రాజెక్టు విజిట్ చేశామని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పారు. విచారణ కోసం పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చామని, ఇవాళ్ల కొంత మందిని విచారించడానికి నోటీసులు పంపామని, రేపు కూడా మరికొంత మంది అధికారులను విచారిస్తామని పేర్కొన్నారు.
నెల రోజుల వ్యవధిలో 54 ఫిర్యాదులు వచ్చాయని, అందులో నష్టపరిహారం అందలేదని కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని పీసీ ఘోష్ వివరించారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని, సాధ్యమైనంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీలనూ పిలుస్తున్నామని, వారి నుంచీ, ఇంకా పలువురు అధికారుల నుంచి అన్ని విధాల సమాచారం తీసుకుంటున్నామని వివరించారు.
ముందుగా చెప్పినట్టుగా జూన్ 30లోపు విచారణ పూర్తి కాదని పీసీ ఘోష్ స్పష్టం చేశారు. తాను హడావుడిగా నివేదిక ఇవ్వాలని అనుకోవడం లేదని, అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని తెగేసి చెప్పారు. అలాగే.. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా విచారణ కొంత ఆలస్యమైందని వివరించారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తయ్యాక, రెగ్యులర్, ఆర్థిక అంశాలపై విచారణ మొదలవుతుంది చెప్పారు. ఇక ప్రభుత్వం నుంచీ అన్ని రిపోర్టులు అందాయని, వాటిపై కూడా పరిశీలనల చేస్తున్నామని తెలిపారు.