– కాళేశ్వరంపై ప్రజల నుంచి 60 పిటీషన్లు
– ఇప్పటికే మొదలైన ప్రాథమిక పరిశీలన
– జులై 5 నుంచి పూర్తి స్థాయి విచారణ
– పిటీషన్లపై నిపుణుల ముందే క్రాస్ ఎగ్జామినేషన్
– 4 రోజుల్లో జస్టిస్ ఘోష్ షెడ్యూల్ ఖరారు
– నేతలకూ అందనున్న తాఖీదులు
– ఆగస్టు చివరి వారానికి తుది నివేదిక
PC Ghose Commission: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వేళ..తమ విచారణనే వేగవంతం చేయాలని పీసీ ఘోష్ కమిషన్ భావిస్తోంది. మార్చి 14న ఈ కమిషన్ ఏర్పాటైన వేళ.. 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినా, పలు సంక్లిష్ట అంశాల మీద స్పష్టత రావాల్సి ఉండటంతో శనివారం ప్రభుత్వం ఈ గడువును పెంచాల్సి వచ్చింది. ఏప్రిల్ 24, మే 6న రెండు దఫాలుగా మొత్తం పది రోజుల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మొదలు పలువురి విచారణలో పాల్గొనగా, జులై 5 నుంచి మలిదఫా విచారణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి మౌఖికంగా వివరాలు సేకరించిన కమిషన్.. ప్రజల నుంచి కూడా ఆధరాలను సేకరించాలని నిర్ణయించి, బహిరంగ ప్రకటన జారీ చేయగా, ఇప్పటికి 60కి పైగా అఫిడవిట్లు వచ్చాయి. వీటిలో కొందరు అధికారుల అఫిడవిట్లూ ఉన్నాయి. దీంతో జులై 5 నుంచి వీటిపై బహిరంగ విచారణ జరపటంతో బాటు అధికారుల నుంచి వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
హైదరాబాద్‌కు పీసీ ఘోష్
మూడవ విడత విచారణకు పీసీ ఘోష్ హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్న వేళ.. బహిరంగ ప్రకటనకు స్పందనగా వచ్చిన 60కు పైగా అఫిడవిట్లను కమిషన్ సభ్యులు ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ గత రెండు వారాలుగా కోల్‌కతాలో ఉన్నప్పటికీ, కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారంపై రూర్కీ ఐఐటీ మొదలు పలు ప్రముఖ సంస్థల ఇంజనీర్లతో చర్చిస్తున్నారు.కమిషన్ ముందుకొచ్చిన కాగ్ నివేదకనూ కమిషన్ సభ్యులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, సంబంధిత అధికారుల వివరణనూ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అఫిడవిట్ల పరిశీలన పూర్తవుతుందనీ, తర్వాత కమిషన్ సభ్యులంతా చర్చించుకుని విచారణ షెడ్యూల్‌కు నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు జులై 5న నిపుణులు భేటీ అవుతారని తెలుస్తోంది.
డిజైన్ల మార్పుపై…
తెలంగాణ నీటి పారుదల శాఖకు చెందిన ఒక బృందం ఇప్పటికే రూర్కీ వెళ్లి మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ గురించి చర్చించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ డిజైన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మార్చాల్సి వచ్చింది? అనే అంశంతో విచారణ మొదలు పెట్టి, దీనికి సంబంధించిన అనుమతులు, నిర్మాణ క్రమంలో జరిగిన ఉల్లంఘనలు వంటి వాటిపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుని, టెక్నికల్ అంశాల మీద కమిషన్ ఒక అభిప్రాయానికి రానుంది. ఇదే సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీద ఎన్డీఎస్ఏ, పలు కేంద్ర సంస్థల నిపుణులు తయారుచేసిన నివేదికలను కమిషన్ అధ్యయనం చేయనున్నది.
టెక్నికల్ అంశాల తర్వాత ఫైనాన్స్ మీద నజర్
కాళేశ్వరం డిజైన్, నిర్మాణం వంటి అంశాలలోని టెక్నికల్ అంశాలు సంక్లిష్టంగా, వైవిధ్యభరితంగా ఉండటంతో ముందుగా వీటిపై ఓ క్లారిటీకి రావాలని కమిషన్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లు సమర్పించిన వారిని విచారణకు పిలిచి బహిరంగ విచారణ చేయాలనీ, అదే సమయంలో వారు చెప్పే అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి నిపుణులనూ ఏర్పాటు చేయాలని కమిషన్ భావిస్తోంది. దీనికోసం బీఆర్‌కేఆర్ భవన్‌లోని కాన్ఫరెన్సు హాలులో ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల డిజైన్లు టెక్నికల్‌గా సరైన తీరులోనే ఉన్నాయా లేదా అనే అంశం మీద నిపుణుల అభిప్రాయాలు విన్నతర్వాత, అవసరాన్ని బట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతోనూ చర్చించాలని కమిషన్ భావిస్తోంది. బ్యారేజీలకు అవసరమైన పర్యావరణ, సాంకేతిక అనుమతులు, నిర్మాణానికి మందు ఆయా ప్రదేశాల్లో నిర్వహించాల్సిన పలు పరీక్షల మీదా కమిషన్ ఆరా తీయనుంది. టెక్నికల్ అంశాలపై విచారణ కాగానే, కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన నిర్మాణ సంస్థల నుంచి అనధికారికంగా సబ్ కాంట్రాక్టులు పొందిన వ్యవహారాలపైన, అంచనా వ్యయాల పెంపుపైన కమిషన్ దృష్టి సారించనుంది. ఈ క్రమంలో ఆయా సంస్థల బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించనుంది. మూడు బ్యారేజీలను నిర్మించిన సంస్థల నుంచి ఇప్పటికే వివరాలు సేకరించిన కమిషన్.. వారి అఫిడవిట్లను మరోమారు పరిశీలించనుంది.
నేతలకు తాఖీదులు..
బ్యారేజీల నిర్మాణంలో, ఆర్థిక వ్యవహారాల మీద ఆరా తీసేందుకు సంబంధిత శాఖల మంత్రులు, బాధ్యులైన ప్రజాప్రతినిధులకు విచారణ కమిషన్ నోటీసులు పంపనుంది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన నిర్మాణ సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న నేతలు, మౌఖిక ఆదేశాల మేరకు సబ్ కాంట్రాక్టులు పొందిన సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న నేతలతో బాటు మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరి పేర్లు బయటికి వస్తాయోననే ఆసక్తి నెలకొంది.