– సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం క్లారిటీ
– జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కిషన్ రెడ్డి
– కేసీఆర్ వల్ల సింగరేణి అప్పులపాలైందని విమర్శలు
– గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం
– నీట్ వివాదంపైనా స్పందించిన కేంద్రమంత్రి
Singareni: ఉద్యోగ నియామకాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, ఇప్పుడు దాని ఊసే లేదని మండిపడ్డారు. గ్యారెంటీలకే గ్యారెంటీ లేదని సెటైర్లు వేశారు. ఉచిత బస్సు తప్ప ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.
‘‘సింగరేణి అంశంలో కాంగ్రెస్ వితండవాదం చేస్తోంది. సింగరేణిని పూర్తిగా విధ్వంసం చేసింది బీఆర్ఎస్. సింగరేణిని కేసీఆర్ కుటుంబం దివాళా తీయించింది. 2014 ముందు బ్యాంక్ అకౌంట్లో రూ.3,509 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ఏనాడూ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితులు లేవు. కేసీఆర్ వచ్చాక సింగరేణి అప్పుల పాలయ్యింది. రాజకీయ లబ్ది కోసమే వాడుకున్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనడం శుద్ధ అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. కేసీఆర్ ఇంకా బ్రమలోనే ఉన్నారు’’ అంటూ విమర్శలు చేశారు కిషన్ రెడ్డి.
కాంగ్రెస్ హయాంలో అతిపెద్ద కోల్ స్కాం జరిగిందని గుర్తు చేశారు. ఆ కేసుల్లో కొంత మంది కాంగ్రెస్ నేతలు జైల్లోకి సైతం వెళ్లారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే బొగ్గు గనులను వేలం వేశామని, దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి నయా పైసా రాదని చెప్పారు. దేశ సంపద పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సింగరేణిపై సమగ్ర సమీక్ష చేపడతామని తెలిపారు. ఇక, నీట్ పరీక్షపై సమగ్ర విచారణకు సిద్ధంగా ఉన్నామని, ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. నీట్‌పైన తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.