– ఎన్నికల స్టేట్‌మెంట్ కాదు.. నా కమిట్‌మెంట్ ఇది
– ఎన్డీయేపై ప్రజలకు అచంచల నమ్మకం
– తాజా ఫలితాలు ఈ విశ్వాసాన్ని ప్రస్ఫుటించాయి
– 3 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు కలిపినా మా కంటే తక్కువే
– ఈ సారి ఈవీఎంలపై అనుమానాలు రాలేదేం?: నరేంద్ర మోదీ
– పార్లమెంటుపక్ష నేతగా ఏకగ్రీవంగా మోదీని ఎన్నుకున్న ఎన్డీయే
– నరేంద్ర మోదీ దేశానికి సరైన నాయకుడు: చంద్రబాబు
Congress: పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం జరిగిన గ్రాండ్ మీటింగ్‌లో నరేంద్ర మోదీని తమ పార్లమెంటుపక్ష నేతగా ఎన్డీయే కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నరేంద్ర మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు బలపర్చారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి అధికారంపై కాంక్షతో ఏర్పడింది కాదని, దేశమే తమ ప్రథమ ప్రాధాన్యత అనే నియమానికి కట్టుబడి ఉన్న పక్షాలు ఒక్కటిగా ఏర్పడిన కూటమి అని వెల్లడించారు. భారత దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన కూటమి ఇదేనని స్పష్టం చేశారు. అన్ని నిర్ణయాల్లో ఏకగ్రీవానికి రావడమే తమ లక్ష్యం అని వివరించారు. తమ కూటమి రాజ్యాంగ విలువలను ఎత్తిపడుతుందని చెప్పారు.
‘2019లో ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మీరు నన్ను నాయకుడిగా ఎంచుకున్నారు. అప్పుడు నేను ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పాను. అది నమ్మకం. ఈ రోజు మీరు మళ్లీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అంటే.. మీకు, నాకు మధ్య బలమైన నమ్మకం ఉన్నదని అర్థం. ఈ బంధం బలమైన పునాది మీదే నిర్మితమవుతుంది. ఈ కూటమికి ఉన్న అతిపెద్ద ఆస్తి ఈ నమ్మకమే’ అని మోదీ ఎన్డీయే కూటమి గురించి వివరించారు.
‘2024 ఫలితాలు ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ బలోపేతం చేస్తున్నాయి. ఈ దేశం కేవలం ఎన్డీయేనే నమ్ముతున్నది. అచంచల విశ్వాసం ఉన్నప్పుడు అంచనాలూ పెరగడం సహజమే. ఇది మంచిదే. గడిచిన పదేళ్లు ట్రైలర్ మాత్రమేనని ఇటీవలే చెప్పాను. ఇది ఎన్నికల స్టేట్‌మెంట్ కాదు. అది నా కమిట్‌మెంట్’ అని మోదీ చెప్పారు. వచ్చే పదేళ్లలో తాము సుపరిపాలన, అభివృద్ధిపై తాము ప్రధాన దృష్టి పెడుతామని అజెండా సెట్ చేశారు.
కాంగ్రెస్ కూటమిపై విమర్శలు సంధిస్తూ.. ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేవారు జూన్ 4న ఫలితాలు వెలువడ్డాక మౌనం దాల్చారని చురకలంటించారు. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని బలహీనపరిచే అన్ని ప్రయత్నాలనూ ఈ కూటమి నాయకులు చేశారని విమర్శించారు. ఈవీఎంలను, ఎన్నికల సంఘం విశ్వసనీయతను అనుమానించారని, కానీ, జూన్ 4న వచ్చిన ఫలితాలు చూసి నోరు మెదపలేదని అన్నారు. ఈవీఎంలు వారి నోళ్లను మూసేశాయని, ఇది భారత ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అని తెలిపారు.
2024 లోక్ సభ ఫలితాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ఓటమి వంటివేనని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఎన్డీయే ఎప్పుడూ ఓడిపోదని ప్రజలకు తెలుసు అని మోదీ చెప్పారు. కానీ, పదేళ్లు దాటినా కాంగ్రెస్ పార్టీకి సీట్లు సెంచరీ దాటలేదని విమర్శించారు. గత మూడు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను కలపి చూసినా.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిన సీట్లకు తక్కువే అని తెలిపారు.
నరేంద్ర మోదీ గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. మోదీకి స్పష్టమైన విజన్ ఉన్నదని, సేవ చేయాలనే తపన ఉన్నదని వివరించారు. ఆయన ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నదని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన సమర్థవంతంగా, నిజాయితీగా అమలు చేశారని చెప్పారు. నేడు భారత దేశం సరైన నాయకుడిని కలిగి ఉన్నదని, ఆయనే నరేంద్ర మోదీ అని వివరించారు.
రాష్ట్రపతిని కలిసిన మోదీ
ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. అనంతరం, నరేంద్ర మోదీ రాష్ట్రపతిని కలిశారు. మూడోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. 73 ఏళ్ల నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 9)న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.